తెలంగాణ సినిమా సాంస్కృతిక విప్లవానికి నాందిబందూక్

బాహుబలిలాంటి సినిమాలు డబ్బులున్నవారు ఎవరైనా తీయొచ్చు. కానీ బందూక్‌లాంటి సినిమా తీయాలంటే తెలంగాణ బ్రతుకుపోరాటం తెలిసుండాలి. ఈ బందూక్ తెలంగాణ అస్థిత్వానికి ప్రతీకలా శత్రువుల గుండెల్లో పేలుతుంది. తెలంగాణ సినిమాలో ఓ సాంస్కృతిక విప్లవానికి నాంది పలుకుతుంది. తెలంగాణ సమాజం పట్ల గొప్ప బాధ్యతతో తీసిన ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రానికి ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయసహకారాలు అందేలా చూస్తాను అన్నారు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సారథి రసమయి బాలకిషన్. పూర్తిగా తెలంగాణ కళాకారులు, సాంకేతిక నిపుణులతో బి.బి.ఎస్.స్టూడియో మోషన్ పిక్చర్స్ సంస్థ రూపొందించిన చిత్రం బందూక్.


గుజ్జ యుగంధర్‌రావు నిర్మాత. లక్ష్మణ్ మురారి (బాబీ) దర్శకుడు. దేశపతి శ్రీనివాస్, విద్యాసాగర్‌రావు, మిథున్‌రెడ్డి, చైతన్య మదాడి, కృష్ణచైతన్యజోషి, అనురూప్, శహెరాభాను ప్రధాన పాత్రల్లో నటించారు. రేపు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. చిత్ర ఆడియో విజయాన్ని పురస్కరించుకొని మంగళవారం హైదరాబాద్‌లో ప్లాటినమ్ డిస్క్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా యన్.శంకర్ మాట్లాడుతూ పాటలు విశేష ప్రజాదరణ పొందుతున్నాయి. టైటిల్‌ను చూసి కొందరికి మాత్రమే పరిమితమైన సినిమా అనుకోవద్దు. అన్ని వర్గాల ప్రజలు ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని, సామాజిక జీవితాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించే ప్రయత్నం చేశారని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేపథ్యంలో పాట రాయడం అదృష్టంగా భావిస్తున్నానని నందిని సిద్ధారెడ్డి చెప్పారు.

చక్కటి నిర్మాణ విలువలతో సినిమాను తెరకెక్కించారని, తెలంగాణ చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల్ని రసమయి బాలకిషన్ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతామని తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు విజేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ చిత్రానికి తెలంగాణ రాష్ట్ర సమితి యూత్ విభాగాలన్ని ప్రచారం కల్పించేలా సహాయం చేస్తానని టీఆర్‌ఎస్ నాయకుడు బొంతు రామ్మోహన్ చెప్పారు. దర్శకుడు లక్ష్మణ్ మురారి మాట్లాడుతూ పూర్తిగా తెలంగాణ కళాకారులు, సాంకేతిక నిపుణులతో తెరకెక్కించిన చిత్రమిది. నిర్మాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. తెలంగాణ ప్రజల దీవెనలు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో సినిమాను ప్రేక్షకులముందుకు తీసుకొస్తున్నాం అన్నారు.

రమేష్ హజారీ మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు ఆరు అడుగుల బుల్లెట్‌లాంటి వాడు. ఆయన వలసవాదుల ఎత్తుల్ని చిత్తుచేస్తూ తెలంగాణ సమాజాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. కేసీఆర్‌లాంటి నాయకుడు వున్నాడనే భరోసాతోనే నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలు నిర్భయంగా బ్రతుకుతున్నారు అన్నారు. తెలంగాణ ప్రజల పక్షాన రూపొందించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని శివకుమార్ ఆకాంక్షించారు. నిర్మాత గుజ్జ యుగంధర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ నవతరాన్ని సినిమా పరిశ్రమకు పరిచయం చేయాలనే సంకల్పంతో ఈ చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టాను. నీ బందూక్ లోపలే వుండిపోతుంది. బయటకు రాదు అని ఎంతోమంది భయపెట్టారు.

అయినా ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని తెరకెక్కించాం. పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా బ్రీత్‌లెస్‌సాంగ్ సంచలనం సృష్టిస్తోంది. యావత్ తెలంగాణ సమాజం ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు. అర్థవంతమైన సాహిత్యానికి చక్కటి బాణీలు తోడవడంతో పాటలు శ్రోతల ఆదరణ పొందుతున్నాయని సంగీత దర్శకుడు కార్తీక్ కొడగండ్ల ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథుల చేతుల మీదుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్లాటినమ్ డిస్క్ జ్ఞాపికల్ని స్వీకరించారు.

No comments:

Post a Comment