"పదో చెల్లెమ్మ"తో అన్నయ్యకు తంటాలు!

తెలంగాణా రాష్ట్ర సమితి మహిళా నేత, సినీ నటి విజయశాంతి అలక పాన్పు ఎక్కారు. తనకు మెదక్ పార్లమెంట్ సీటును కేటాయింపుతో సహా లోపాయికారి ఒప్పందం మేరకు ఆరు సీట్లు కేటాయించాల్సిందేనని ఆమె పట్టుపట్టారు. దీంతో ఖంగుతిన్న తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు, ప్రధానకార్యదర్శి హరీష్ రావులు హుటాహుటిన ఆమె నివాసానికి వెళ్లి బుజ్జగించినట్టు ఆ పార్టీ కార్యకర్తల సమాచారం.

సొంతగా తల్లి తెలంగాణా పార్టీని స్థాపించిన విజయశాంతి, ఆ తర్వాత ఆ పార్టీని తెరాసలో వినీనం చేసిన విషయం తెల్సిందే. విలీన సమయంలో ఒక పార్లమెంట్‌ (మెదక్)తో ఆరు అసెంబ్లీ సీట్లు ఇచ్చేలా ఆమె ఒప్పందం చేసుకుంది. అయితే, తన పని పూర్తయ్యాక మాటతప్పే నైజమున్న కేసీఆర్.. సరిగ్గా అదే పని చేశారు.

కరీంనగర్ స్థానంలో తనకు గట్టి పోటీ ఎదురవుకానుందని భావించిన ఆయన మెదక్ స్థానం నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. అదే సమయంలో విజయశాంతికి జహీరాబాద్ లేదా మల్కాజ్‌గిరిలను కేటాయించాలని నిర్ణయించారు. ఇది తెలియడంతో ఖంగుతున్న రాములమ్మ.. అలకపాన్పెక్కారు.

ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్, ఆగమేఘాలపై ఆమె నివాసానికి చేరుకుని బుజ్జగించారు. "నీకున్న గ్లామర్‌కు తెలంగాణాలో ఎక్కడ నుంచి పోటీ చేసినా విజయం సాధించి తీరుతావు. ఎలాగో వామపక్షాలు, తెదేపాలు అండగా ఉండనే ఉన్నాయి" అంటూ ఆమెను మునగచెట్టు ఎక్కించారు.

అంతేకాకుండా.. ఒకవేళ తాను మెదక్ నుండి పోటీ చేయకపోతే తప్పకుండా నిన్నే బరిలోకి దించుతామని హామీ ఇచ్చాక గానీ ఆమె అలకపాన్పు దిగారని తెరాస వర్గాల సమాచారం. అయితే, మాటల రాజకీయ మాయగాడిగా పేరున్న అన్నయ్యతో పదో చెల్లెమ్మ కాస్త ఆచితూచి వ్యవహరిస్తే మంచిది.

No comments:

Post a Comment