IN FOCUS: మరో పిల్లలమర్రి ఈ ఊడల మర్రి

మహబూబ్‌నగర్‌లోని ఊడలమర్రికి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.. అది జగమెరిగిన మర్రి! కాని ఇక్కడ ఊడలజడలను జారవిడిచి కనిపిస్తున్న ఈ మర్రి గురించి పెద్దగా తెలుసుండకపోవచ్చు చాలామందికి! దీని పేరు ఊడలమర్రి.. నివాసం.. మహబూబనగర్‌జిల్లాలోని కొందుర్గమండలం.. పెద్ద ఎల్కిచర్ల గ్రామం..ఎల్లీరన్న ఊడలమర్రిగా ప్రాచుర్యంలో ఉన్నది!

ప్రశాంతమైన అటవీ ప్రాంతం.. దట్టమైన ఊడలతో ఎకరాల పరిధిలో విస్తరించి ఉన్న ఈ ఊడల మర్రిని పాలమూరు జిల్లాలో మరో పిల్లలమర్రిగా పిలుస్తారు. అంతేకాదు ఇక్కడ ఎల్లీరన్నస్వామి విగ్రహస్థాపనతో ఈ ప్రదేశం మహిమాన్వితమైంది. అయితే ఈ ప్రాంతానికి నడిచే దారి లేక.. పట్టించుకునేవారు కానరాక.. పర్యటక స్థలంగా మారే అవకాశం ఉన్నా.. అజ్ఞాతం అనుభవిస్తోంది!


మర్రి మహిమ ఇలా..
పంట పొలాల మధ్య ఎత్తైన ఊడలతో సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఈ చెట్టు వ్యాపించి ఉంది. 300 ఏళ్ల కిందట ఈ చెట్టు మొలిచిందని, ఇంతింతై పెద్దగా విస్తరించి అందరినీ ఆకట్టుకునే స్థాయికి ఎదిగిందని సమీప స్థానికులు ఆసక్తికరంగా చెబుతుంటారు. ఈ మర్రి చెట్టు కింద ఎల్లీరన్నస్వామి వెలిశాడని, ఆ భగవంతుడి దయతోనే ఈ ప్రాంతంలో పాడి పంటలు పుష్కలంగా పండుతాయని ఇక్కడి ప్రజల నమ్మకం. పూర్వకాలంలో వీరన్న.. అతని చెల్లెళ్లు గాలమ్మ, ఎల్లమ్మలు ఉండేవారు. అప్పట్లో గ్రామాల్లో పొంగువ్యాధి సోకి ప్రజలు మృత్యువాతపడుతుండేవారట. అప్పుడు ఈ వీరన్న మర్రిచెట్టు సమీపంలో ఉన్న గురువోని బావిలో స్నానం చేసి పొంగు వ్యాధితో బాధపడుతున్నవారికి మందులు ఇచ్చేవాడట.

ఆయన ఇచ్చిన మందులతో ఆ వ్యాధి బారి నుంచి అతని చెల్లెళ్లు గాలమ్మ, ఎల్లమ్మలతో పాటు ఆ ఊరి ప్రజలూ బతికిబట్టకట్టారు. ఈ విషయం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు కూడా వీరన్నను ఆశ్రయించి ఆ బీమారి నుంచి ఉపశమనం పొందారట. అట్ల వీరన్న ప్రజలను కాపాడడంతో ఆయన పేరు మీద వీరన్నపేట, గాలమ్మ పేరు మీద గాలిగూడెం, ఎల్లమ్మ పేరు మీద ఎల్కిచర్ల గ్రామాలను ఏర్పాటు చేశారు ఆ ఊళ్లోని జనాలు. తర్వాత వీరన్న, ఎల్లమ్మ, గాలమ్మ చేసిన సేవలకు గుర్తింపుగా వాళ్లను దైవసమానులుగా భావించి ముగ్గురు పేర్లు వచ్చేలా ఆ ప్రాంతాన్ని ఎల్లీరన్నస్వామిగా పిలుచుకుంటూ అక్కడున్న ఓ పెద్ద మర్రిచెట్టు కింద ఓ విగ్రహాన్ని నెలకొల్పారట. నాటి నుంచి నేటి వరకూ ఆ విగ్రహం పూజలందుకుంటూనే ఉన్నది.

ఇదే కాకుండా ఎల్లీరన్నస్వామికి మరో ప్రత్యేకత కూడా ఉన్నది. పూర్వకాలంలో ఈ ప్రాంత పొలాలన్నీ పాడి పంటలతో కళకళలాడుతుండేవట. రైతులు తాము పండించిన పంటను కల్లాల్లో రాశులుగా పోసుకునేవారు. ఆ రాశులకు ఎల్లీరన్నస్వామే కాపలాగా ఉండేవాడని.. ధాన్యాన్ని దోచుకునేందుకు వచ్చిన వారిని అక్కడే కట్టిపడేసేవాడని ఇక్కడి రైతుల కథనం. దీంతో ఎల్లీరన్నస్వామితోపాటు మర్రిచెట్టు కూడా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. పండించిన పంటలను ముందుగా స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తే పంట బర్కత్ ఉంటుందని, దిగుబడి కూడా అధికంగా వస్తుందని ఇక్కడి రైతుల విశ్వాసం!

ప్రతియేటా ఉత్సవాలు
ఇక్కడి జనం.. ప్రతియేటా భాద్రపదమాసంలో వినాయక నిమజ్జనం రోజున ఎల్లీరన్నకు ఘనంగా ఉత్సవం నిర్వహిస్తారు. ఈ తీర్థానికి చుట్టుపక్కల గ్రామాలైన గాలిగూడెం, వీరన్నపేట, రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం ముజాయిద్‌పూర్, లింగంపల్లితోపాటు సమీప తండాల ప్రజలు తరలి వస్తారు. రైతులు పండించిన ధాన్యం, కూరగాయలు, పండ్లతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఇట్లా యేడాదికి ఒక్కరోజుతో సరిపెట్టకుండా ప్రతి వారం ఎల్లీరన్నస్వామికి అష్టోత్తర శతనామాలు, వీరచంద్రుడి పూజలు, శివష్టోత్తర పూజలూ నిర్వహిస్తారు.

ఎల్లీరన్న మర్రి.. మరో పిల్లల మర్రి..
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఉన్న పిల్లలమర్రి ఊడలు చిన్నగా ఉంటాయి. విస్తీర్ణంలో ఈ మర్రి కాస్త పెద్దదైనప్పటికీ ఎల్లీరన్నమర్రికే పలు ప్రత్యేకతలు ఉన్నాయి. పొడవాటి మర్రి ఊడలు, దట్టమైన ఆకులు, విశాలంగా విస్తరించిన చెట్టు మొదలు... పచ్చని పందిరిని తలపిస్తుంది.

చెట్టును చూసిన ప్రకృతి ప్రేమికులకు పచ్చని ఆ చెట్టుఒడిలో చల్లగా సేదతీరితే బాగుండు అనే భావనను కలిగిస్తుంది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలలోని పలు గ్రామాల రైతులకు ఈ ఎల్లీరన్న సహిత మర్రి కొంగు బంగారంగా నిలుస్తున్నది. ఇంత చరిత్ర గలిగిన ఈ మర్రికి కనీస రోడ్డు మార్గం లేకపోవడం దురదృష్టకరమని ఇక్కడికి వచ్చే భక్తులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎల్కిచర్ల గ్రామం నుంచి పిల్లబాట తప్ప ఈ మర్రికి మరే ఇతర దారులు లేవు. ప్రభుత్వం స్పందించి ప్రత్యేక శ్రద్ధ చూపితే ఎల్లీరన్నమర్రి మహబూబ్‌నగర్ జిల్లాలో మరో పర్యటక కేంద్రంగా మారడం ఖాయమంటున్నారు స్థానికులు!

పర్యాటకంగా అభివృద్ధి చేయాలి
పెద్దఎల్కిచర్ల గ్రామ శివారులోని మర్రిచెట్టు కింద వెలసిన ఎల్లీరన్నస్వామికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్నది. వీరన్న పేరుతో వీరన్నపేట, గాలమ్మ పేరుతో గాలిగూడెం, ఎల్లమ్మ పేరుతో ఎల్కిచర్ల ఇలా మూడు గ్రామాలను అనుసంధానం చేస్తూ ఉన్న ఎల్లీరన్నకు ఎండోమెంట్ అధికారులు గుడికట్టించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి. ప్రతియేటా నిర్వహించే ఉత్సవాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి.

మౌలిక వసతులు కల్పించాలి..
ఉత్సవాల్లో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఎల్లీరన్నమర్రి వద్దకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. వాళ్లకు కనీస వసతులు కల్పించాలి. సుమారు రెండు కిలోమీటర్ల మేర రోడ్డు సౌకర్యం లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఎల్లీరన్నమర్రికి రోడ్డు సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది.

No comments:

Post a Comment