ఓటుకు నోటు ఉదంతం అవశేష ఆంధ్రప్రదేశ్‌ను ఊపేస్తున్నది. ఈ కేసులో పీకలదాకా కూరుకుపోయిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు కటకటాలు తప్పవనే ప్రచారం అక్కడ జోరందుకున్నది. బాబుకు రాజకీయంగా ప్రమాద ఘంటికలు వినిపిస్తున్నాయి. పార్టీలో అసమ్మతివాదులు ఒక సీనియర్ నాయకుడి ఆధ్వర్యంలో సమావేశాలు జరుపుతున్నారనే ప్రచారం సాగుతున్నది.
మరోవైపు ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అంశం మీద అక్కడ కోట్ల రూపాయల బెట్టింగులు నడుస్తున్నాయి. చంద్రబాబు జైలుకు వెళ్తాడా? వెళ్లడా? అనేది ఒక అంశమైతే.. ముఖ్యమంత్రి పదవిలో ఉంటాడా? దిగిపోతాడా? అనేది మరో అంశం.. ఈ అంశాల్లో పందేలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా రేవంత్‌రెడ్డిని ఏసీబీ కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత బెట్టింగులు భారీగా పెరిగాయని తెలిసింది.
కోట్ల రూపాయలలో బెట్టింగ్...!
మొదటినుంచి బెట్టింగులకు పేరుపడిన ఏపీలో చంద్రబాబు ఉదంతం తాజాగా బెట్టింగురాయుళ్లకు పండుగ తెచ్చింది. ముఖ్యంగా గుంటూరు, కృష్ణ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ప్రకాశం, చిత్తూరు, కడప తదితర జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో ఈ బెట్టింగ్ వ్యవహారం జోరుగా సాగుతున్నట్లు తెలిసింది.రేవంత్‌రెడ్డి వ్యవహారమంతా టీవీలలో చూడడంతో ఈ విషయంలో ఎవరికి వారు సొంత అంచనాలకు వచ్చి ఉత్సాహంగా బెట్టింగులు కడుతున్నట్టు తెలిసింది.
ప్రస్తుతం చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్తాడా? వెళ్లడా? అనే విషయంలో కోట్లాది రూపాయల బెట్టింగ్ జరుగుతోంది. జైలుకు వెళ్తాడని బెట్టింగ్ పెడితే లక్షకు రెండు లక్షలు.. వెళ్లడు అని బెట్టింగ్ పెడితే కూడా అదే రీతిలో బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం. అలాగే చంద్రబాబు పదవీ వియోగంపై కూడా బెట్టింగులు సాగుతున్నాయి. ఇటీవల జరిగిన కార్యక్రమాలలో చంద్రబాబు మాట్లాడుతున్న తీరు తేడాగా ఉందని బెట్టింగ్ సమయాలలో చర్చించుకుంటున్నారు.
రాజకీయ కలకలం
మరోవైపు ఏసీబీ కేసులో చంద్రబాబును కూడా నిందితుడిగా చేరుస్తున్నారన్న ఉహాగానాల మధ్య ఆ రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. ఇంతకాలం అవకాశం కోసం వేచి చూస్తున్న ఆ పార్టీలోని అసమ్మతి నేతలు రేవంత్‌రెడ్డి వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని పావులు కదుపుతున్నారని సమాచారం అందింది. గత ఏడాదికాలంగా చంద్రబాబు నిర్ణయాలు, ఆయన వ్యవహార శైలితో విసిగిపోయిన గుంటూరు జిల్లా సీనియర్ నాయకుడు ఒకరు పార్టీ నాయకత్వ మార్పు లక్ష్యంగా అసమ్మతి ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నారని భారీగా ప్రచారం సాగుతున్నది. రాష్ట్ర రాజధాని వ్యవహారంలో చంద్రబాబు ఒంటెద్దు పోకడను జీర్ణించుకోలేకుండా ఉన్న ఎమ్మెల్యేలు సదరు సీనియర్ నాయకుడిని కలిశారని సమాచారం.
No comments:
Post a Comment