ఏడాది చివర్లో పసిడి ధరలు భారీగా తగ్గే అవకాశం

దేశంలో పేదోడి నుంచి అపర కుబేరుడి దాకా అందరికీ అత్యంత ప్రియమైన పసిడి..ధరల కొండపైనుంచి క్రమంగా కిందికి దిగుతున్నది. ప్రస్తుతం రూ.27 వేలకు అటు ఇటుగా తచ్చాడుతున్న ఉన్న తులం(10 గ్రాములు) బంగారం రేటు.. భవిష్యత్‌లో రూ.20,500 స్థాయికి పడిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచితే గోల్డ్ రేట్లు భారీగా క్షీణించవచ్చని ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో అభిప్రాయపడింది.

ఏడాది చివర్లో ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచనుందన్న ఆందోళనలు, నిరాశాజనకంగా ఉన్న కార్పొరేట్ల త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, మందకొడిగానే సాగుతున్న వృద్ధి, వర్షాభావ పరిస్థితుల అంచనాలతో ఇప్పటికే ఈక్విటీ, ఫారెక్స్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఫెడ్ రేట్ హైక్ ప్రభావం పసిడిపైనా పడనుందని, ఈ పరిణామంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ధర(28.5 గ్రాములు) 900-1050 డాలర్ల స్థాయికి పడిపోవచ్చని తాజా రిపోర్టులో ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. దీంతో దేశీయ బులియన్ మార్కెట్లో ధరలు రూ.20,500 నుంచి రూ.24,000 స్థాయికి తగ్గవచ్చని అంటున్నది. అంటే ప్రస్తుత స్థాయితో పోలిస్తే రేట్లు 10-25 శాతం మేర పడిపోయే అవకాశం ఉంది.


ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచితే అమెరికా డాలర్ మరింత బలపడనుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి, వెండి వంటి విలువైన లోహాలతోపాటు ఇతర కమోడిటీల ధరలు భారీగా తగ్గేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో ప్రతికూల పరిస్థితులు కొనసాగుతున్నప్పుడు ఇన్వెస్టర్లు బంగారం, వెండి ఇతర కమోడిటీల్లో పెట్టుబడులు పెడుతుంటారు. ఆర్థిక వ్యవస్థ మెరుగై ఈక్విటీలు బలపడుతున్న నేపథ్యంలో కమోడిటీ మార్కెట్ నుంచి పెట్టుబడులు స్టాక్ మార్కెట్లోకి తరళివెళుతుంటాయి. అమెరికా ఎకానమీ క్రమంగా పుంజుకుంటుండటంతో దశాబ్దకాలంగా దాదాపు సున్నాగా ఉన్న వడ్డీరేట్లను పెంచాలనుకుంటున్నట్లు యూఎస్ ఫెడ్ రిజర్వ్ గతేడాదే సంకేతాలిచ్చింది. ఇప్పటికే పలుసార్లు వాయిదా వేసుకుంటూ వచ్చిన ప్రక్రియను ఏడాది చివరికల్లా ప్రారంభించే యోచనలో ఉంది.

ఇదే గనుక జరిగితే బంగారంలోని పెట్టుబడులు మెరుగైన రిటర్నులు పంచే ఆర్థిక పథకాల్లోకి మళ్లే అవకాశం ఉంటుంది. దీంతో గోల్డ్‌కు డిమాండ్ తగ్గి రేట్లు గణనీయంగా పడిపోయేందుకు అవకాశం ఉంటుంది. అయితే జపాన్, యూరోజోన్ దేశాలు ఇంకా మాంద్యం పరిస్థితుల్లోనే కొనసాగుతున్న నేపథ్యంలో యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల ప్రతిపాదనను కొంతకాలంపాటు వాయిదా వేసే అవకాశాలు లేకపోలేవని ఇండియా రేటింగ్స్ అంటున్నది.

రేట్ల పెంపును వచ్చే ఏడాది తొలి అర్ధభాగం వరకు వాయిదా వేయాలని ఫెడ్ రిజర్వ్‌ను అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) కోరడం ఇందుకు బలం చేకూరుస్తున్నది. ఈనేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ ఎగువముఖంగా ప్రయాణించవచ్చని సంస్థ నివేదికలో అభిప్రాయపడింది. వడ్డీరేట్ల పెంపు వాయిదాపడితే ఈ ఆర్థిక సంవత్సరం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 1300-1350 డాలర్ల స్థాయికి చేరుకోవచ్చని ఇండియా రేటింగ్స్ అంచనా వేస్తున్నది. దీంతో ఇండియన్ బులియన్ మార్కెట్లో రేట్లు మళ్లీ రూ.29,500-30,500 స్థాయికి ఎగబాకవచ్చని పేర్కొంది.

దేశీయ మార్కెట్లో పసిడి ధరలు నెల రోజుల కనిష్ఠ స్థాయికి జారుకున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.200 మేర తగ్గి రూ.27,000 స్థాయికి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లతోపాటు దేశీయంగానూ ఆభరణ వర్తకులు, రిటైలర్ల నుంచి డిమాండ్ బలహీనంగా ఉండటం ఇందుకు కారణమైంది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు 1176 డాలర్ల స్థాయిలో ఉంది. పుత్తడితోపాటు వెండి రేటు కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఢిల్లీలో కిలో వెండి రేటు రూ.1000 మేర తగ్గి రూ.37,400కు పడిపోయింది.

No comments:

Post a Comment