రాష్ట్రం ప్రభుత్వం ప్రకటించిన ఫిలిం సిటీ నిర్మాణం తెలంగాణ దృక్పథంలోనే జరగాలి. స్థలాల కేటాయింపు, ప్రోత్సాహకాల విషయంలో తెలంగాణకి కచ్చితంగా కోటా ఉండాలి. ప్రభుత్వపరంగా నిర్మించాల్సిన అనేక ఫిలిం సంస్థల నిర్మాణానికి ఫిలింసిటీ ఉత్తమ వేదిక కావాలి. కొత్త తెలంగాణ సినిమా తరాన్ని తయారు ేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికోసం ప్రభుత్వం రాష్ట్రంలో ఒక మంచి ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ని నెలకొల్పి తెలంగాణ యువత సినిమా సాంకేతిక రంగంలో ఎదిగేందుకు తోడ్పడాలి.
ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటై విజయవంతంగా మొదటి ఏడాది పూర్తి చేసుకున్నాం. అనేక విజయాలు సాధించాం. వివిధ కోణాల్లోంచి ఎన్నో ఆటంకాలూ ఎదురవుతున్నా.. తెలంగాణ తన దారిలో తాను ముందుకు సాగుతూనే ఉన్నది.
ఈ నేపథ్యంలో భిన్నమైన అంశాలతోపాటు తెలంగాణ సాంస్కృతిక రంగం వైపు కూడా కృషి జరుగుతున్నది.. ఇంకా సాగవలసి ఉంది. సాంస్కృతిక రంగం అభివృద్ధి చెందకుండా ఏ అభివృద్ధి అయినా అసంపూర్ణమే అవుతుంది. అందుకే చైనాలో అభివృద్ధిని సాంస్కృతిక విప్లవమని మావో అభివర్ణించాడు. సంస్కృతిలో కానీ సాంస్కృతిక రంగంలో కానీ తెలంగాణది విలక్షణమైన వొరవడి. సాంస్కృతిక రంగంలో మిగతావాటికంటే సినిమాది ప్రత్యేకమైన స్థానం. అది అత్యంత ప్రభావవంతమైనది. సామాన్య ప్రజల్లో విస్తృతంగా ఆదరణ పొందింది. అందుకే తెలంగాణ సినిమా గురించి దాని దశ- దిశ గురించి చర్చ జరగాల్సి ఉంది.
ఈ సంవత్సర కాలంలో తెలంగాణలో సినిమాకు సంబంధించి రెండు ఎకరాల్లో ఫిలిం సిటి అన్న ప్రభుత్వ ప్రకటన చాలా ఆశావాహమైన అడుగు. ఇప్పుడున్న తెలుగు సినిమా రంగం హైదరాబాద్‌లో ఉంటుందా..? వైజాగ్ తరలి పోతుందా..? అన్న ప్రచారం విస్తృతంగా జరుగుతున్న వేళ ఫిలిం సిటీ ప్రకటన, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహక ప్రకటనలు, దాదాపుగా అదే సమయంలో వైజాగ్‌లో వచ్చిన హుద్‌హుద్ తుఫాన్ తెలుగు ఫిలిం పరిశ్రమని పునరాలోచనలో పడేశాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ సినిమా ఉనికి ఎదుగుదల గురించి చర్చతో పాటు ప్రభుత్వపరంగా, ఫిలిం మేకర్స్ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆలోచించాలి. తెలంగాణ సినిమా దశ-దిశను నిర్దేశించుకోవాల్సి ఉన్నది. తెలంగాణ సినిమాను వెండి తెర వేదిక పైకి తీసుకురావడానికి తెలుగు సినిమాల్లో తెలంగాణ, తెలంగాణగడ్డ మీద సినిమా రంగం, తెలంగాణ సినిమా ఇలా మూడు అంశాల్ని పరిశీలించాల్సి ఉన్నది.
తెలుగు సినిమాల్లో తెలంగాణకి గత ఎనిమిది దశాబ్దాల్లో ఏనాడూ అందవలసిన స్థానం గాని గుర్తింపు కానీ రాలేదు. ఎక్కడైనా వచ్చినా అది హాస్యానికో ఎగతాళికో తప్ప సరైన స్థానం ఇవ్వలేదు. వర్తమాన తెలుగు సినిమా రంగం ఈరోజు కేవలం టెక్నాలజీ పైన ఆధారపడి వ్యాపారం కోసమే మనుగడ సాగిస్తున్నది. సినిమా ఒక కళ దానికో సామాజిక కోణం ఉన్నదన్న సంగతి ఎప్పుడో మర్చిపోయింది. అట్లా అని ఆర్థికంగా ఎంత మేర బాగుందన్నది వేరే చర్చ.
పెట్టుబడి తిరిగిరాని సినిమాలు, విజయాల్లేక హీరోలు అల్లాడుతున్నారు. కేవలం పది శాతం సినిమాలు మాత్రమే ఆర్థిక విజయాలు అందుకుంటున్నాయని ఫిలిం వర్గాలే చెప్తున్నాయి. ఇక తెలుగు సిన్మా క్వాలిటీ పరంగానూ జాతీయ అంతర్జాతీయ గుర్తింపుపరంగానూ ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంతా మంచిది. ఇన్నేండ్లలో జాతీయ స్థాయిలో ఉత్తమ సినిమాని గానీ నటుడినిగానీ అందించలేకపోయిన తెలుగు సినిమాకి.. ఉత్తమ నటి అవార్డులు అందుకున్న శారద, అర్చనలు నటించిన సినిమాలకు తెలంగాణ వాళ్లయిన బీఎస్ నారాయణ, బీ నర్సింగరావు దర్శకులు కావడం యాదృచ్చికం కాదు అది తెలంగాణ సృజనకి మచ్చుతునక.
ప్రభుత్వంతో అనేక రాయితీల్ని వెసులుబాటునీ అనుభవించి వ్యాపారంగానూ, ఒక ఇండస్ట్రీగానూ తెలుగు సినిమా నిలదొక్కుకున్న విషయాన్ని కాదనలేం. మిగతా పరిశ్రమల్లాగే తెలుగు సినిమా కూడా హైదరాబాద్‌లోనే ఉండాలనే కోరుకుందాం. తెలుగు సినిమా సాంకేతికంగానూ ఆర్థికంగాను రాష్ర్టానికి ఒకరకంగా అవసరమే. అది గమనించే రాష్ట్ర ప్రభుత్వం ఫిలిం సిటీ ప్రకటించింది. ఇక తెలంగాణ గడ్డ మీద సినిమా సంగతి ఆలోచించించినప్పుడు ముంబై తర్వాత అధికంగా చిత్రాల నిర్మాణం జరుగుతున్న కేంద్రంగా హైదరాబాద్ కు పేరుంది. లెక్కలు తీసుకుంటే ఒక సందర్భంలో ఇక్కడే అధిక సంఖ్యలో నిర్మాణాలు జరుతునాయని చెప్పుకోవచ్చు. కేవలం తెలుగు మాత్రమే కాకుండా హిందీతో సహా అనేక భారతీయ భాషా చిత్రాలు కొన్ని హాలీవుడ్ చిత్రాలు కూడా ఇక్కడ నిర్మాణమవుతుండటం గొప్ప విషయమే. అంతలా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ సమకూరింది. ఆర్థికంగా అది తెలంగాణకు బలమే. ఫిలిం సిటి దీనికి మరింత దోహదం చేసే అవకాశం ఉన్నది.
ఇప్పుడు మనదైన తెలంగాణ సినిమా కు పాదులు వేయడం అది ఎదిగేలా చూడడం ప్రారంభం కావాల్సి ఉన్నది. ఇప్పటివరకు శ్యామ్ బెనెగల్ (అంకుర్, నిశాంత్, మండి, సుస్మన్ తదితరాలు), గౌతం ఘోష్ (మా భూమి), బీ నరసింగరావు (దాసి) లాంటి దర్శకులు తెలంగాణ సినిమాకి పాదులు వేశారు, ఆ తర్వాత ఆ ఒరవడిని కొనసాగించిన వాళ్ళు తక్కువ, శంకర్, అల్లాణి శ్రీధర్‌లాంటి వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేశారు.
కేవలం వేళ్ల మీద లెక్కించే సంఖ్యలో వచ్చిన ఆసలైన తెలంగాణ సినిమాల ఉనికి ఇవ్వాళ సంఖ్యాపరంగా గానీ స్థాయి పరంగా గానీ గొప్పగా ఏమి లేదు. తెలంగాణ సినిమా పరుగు సంగతి అటుంచి నడక నేర్చుకోవాల్సిన స్థితిలో ఉన్నది. అంటే స్టూడియోలు మన గడ్డ మీదే వుంటాయి.. కానీ మనకు ప్రవేశం లేదు. నటులు సాంకేతిక రంగంలోనైతే మన ఉనికే ప్రశ్నార్థకం. సృజన భావుకత మన సొంతం కనుక పాటల్లో మన వాళ్లకు మంచి స్థానం ఉన్నది. నిజానికి తెలంగాణలో గొప్ప కథలున్నాయి.. సంగీతం, భాషా సంస్కృతులున్నాయి. ఎట్లయితే బెంగాల్, కేరళలో రీజినల్ సినిమా ఎదిగిందో అట్లాగే తెలంగాణ సినిమాకు కూడా విస్తృతంగా ఎదిగి అంతర్జాతీయ స్థాయిలో నిలదొక్కు కునే శక్తి సామర్థ్యాలున్నాయి.
అయితే తెలంగాణ సినిమా తనదైన ప్రాంతీయ లక్షణాల్ని పుణికి పుచ్చుకోవాల్సి ఉన్నది. వర్తమాన తెలంగాణ నిర్మాతలు, దర్శకులూ మళ్ళీ మరో మూసకట్టు తెలుగు సినిమా తీయడానికి ముందుకువస్తే ఫలితం లేదు.. అవసరమూ లేదు. అలాంటి సినిమాలు తీయడానికి ఇప్పటికే చాలా మంది వేచి ఉన్నారు ఆ మాత్రం మహాభాగ్యానికి తెలంగాణ వాళ్ళేందుకు.. ఈ విషయం ఆలోచించాలి.
కథలు, కళాత్మక పరంగా తెలంగాణ ముందున్నప్పటికీ సినిమాకు సాంకేతిక తోడుకావాల్సి ఉన్నది. తెలంగాణ యువత ఫిలిం టెక్నాలజీలో ఉన్నత శిక్షణ పొందితే.. తెలంగాణ సినిమా ఎల్లలు దాటి ముందుకెళ్తుంది. అట్లాగే కొత్త ఆలోచనలకు కొత్త భావాలకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉన్నది.
వ్యాపార సినిమాకి ఉన్న మూసకట్టు సూత్రాలకు భిన్నంగా తెలంగాణ చలన చిత్రకారులు ఆలోచించాల్సి ఉన్నది. ఇక నూతనంగా ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వం తొలుత వ్యాపార తెలుగు సినిమాకి భరోసా ఇచ్చే చర్యలు చేపట్టింది. ప్రత్యేక మంత్రిని ఇచ్చి హామీ కల్పించింది. ఇప్పుడిక తెలంగాణ సినిమా వైపునకు దృష్టి సారించాల్సి ఉంది. సినిమా రంగంలో తెలంగాణ విత్తనాల్ని నాటి వాటి ఎదుగుదలకు శాస్త్రీయమైన ప్రణాళికాబద్దమైన చర్యలు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రపంచ సినిమా యవనికపై తెలంగాణ జెండాను ఎగురవేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉన్నది. తెలంగాణ సినిమా వర్తమాన దశ నుంచి దిశని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
ప్రభుత్వం తెలంగాణ ఫిలిం సిటీ ప్రకటన తెలంగాణ వారికి కూడా ఆశావాహంగా కనిపించింది. ఇప్పుడే స్పష్టత లేకుంటే ఇందులో కూడా తెలుగు సినిమా బడాబాబులే ముందుండి వసతుల్ని తన్నుకుపోయే ప్రమాదం ఉన్నది. ఇప్పటికే సమైక్య పాలనలో విస్తారంగా లబ్ది పొందిన వాళ్ళు మళ్ళీ ముందు వరసలో నిలబడే ఆస్కారం ఉన్నది. అందుకే ఫిలిం సిటీ నిర్మాణం తెలంగాణ దృక్పథంలోనే జరగాలి. స్థలాల కేటాయింపు, ప్రోత్సాహాల విషయంలో తెలంగాణకి ఖచ్చితంగా కోటా ఉండాలి. ఇక కార్మికుల విషయంలో ఇండ్ల నిర్మాణంలాంటి చర్యలూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వపరంగా నిర్మించాల్సిన అనేక ఫిలిం సంస్థల నిర్మాణానికి ఫిలింసిటీ ఉత్తమ వేదిక కావాలి. వసతులు, సాంకేతిక విషయాలు అట్లా ఉంటే తక్షణమే కొత్త తెలంగాణ సినిమా తరాన్ని తయారు చేసుకోవాల్సి ఉన్నది. దానికోసం ఎన్నో కాలేజీలు, జిల్లాకో యూనివర్శిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం రాష్ట్రంలో ఒక మంచి ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ని నెలకొల్పి తెలంగాణ యువత సినిమా సాంకేతిక రంగంలో ఎదిగేందుకు తోడ్పడాలి.
తక్షణమే ఫిలిం డెవలప్‌మెంట్ కమిషన్‌ను విభజించి ఇన్నేండ్లుగా సీమాంధ్ర ఆధిపత్యంలోనున్న సంస్థను తెలంగాణ పరం చేయాలి. ఇంతకాలం సబ్సిడీలు, గ్రాంట్ల పేరిట సీమాంధ్ర సినిమా రంగం చేసిన దోపిడీని అరికట్టాలి. అట్లనే ఆర్కైవ్స్ నిర్మాణం, జిల్లాల్లో ఫిలిం కాంప్లెక్స్‌ల నిర్మాణం చేపట్టాలి. వినూత్నంగా, విలక్షణంగా ముందుకుసాగుతున్న తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సినిమా దశ-దిశను మార్చాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలో బంగారు సినిమా రూపొందడానికి తక్షణమే నడుం బిగించాల్సిన తరుణం ఆసన్నమైంది.
No comments:
Post a Comment