ఎన్నికల సమరంలో "తారా"తోరణ తళుకులు

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. గతంలో ఎన్నడూ లేనంతగా తారా కాంతులతో రాష్ట్ర రాజకీయ చదరంగం ధగధగా మెరిసిపోతోంది. అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెక్ పెట్టి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవాలని అటు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, ఇటు కొత్త పార్టీ ప్రజారాజ్యం పార్టీలు తమ శక్తిమేరకు కృషి చేస్తున్నాయి. ఇందుకోసం తమకు అందుబాటులో ఉన్న తారాగణాన్ని ఎన్నికల గోదాలోకి దించింది.

తామేమి తక్కువ తినలేదన్నట్టుగా కాంగ్రెస్ కూడా తారలకు పలు తాయిలాలు ఎరవేసి అక్కున చేర్చుకుంటోంది. అయితే, తెదేపా, పీఆర్పీ సినీ ధగధగల ముందు కాంగ్రెస్ వెలవెలబోతోంది. ఈ మూడు పార్టీలతో సహా భాజపా, తెరాసలకు కూడా తారా తళుకులు ఉన్నాయి. కానీ, తెదేపా, పీఆర్పీ, కాంగ్రెస్‌లు మాత్రం పోటాపోటీగా బావలు, మేనల్లుళ్లు, తమ్ముళ్లు, సినీ తారాగణం మద్దతుతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

రాష్ట్ర రాజకీయ రంగ చరిత్రలో తొట్టతొలిసారిగా ఇంతమంది తారాగణం అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం కాకుండా, కొందరు నటీనటులు ప్రత్యక్ష ఎన్నికల గోదాలోకి దిగుతున్నారు. ఇలాంటి వారిలో నందమూరి వారసులు హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న, కళ్యాణ్ రామ్, హాస్య నటుడు బాబూ మోహన్, తెలుగుమహిళా అధ్యక్షురాలు ఆర్కే.రోజాలు తెదేపా తరపున సందడి చేస్తున్నారు.

ప్రజారాజ్యం తరపున మెగాస్టార్ చిరంజీవి, ఆయన సోదరులు పవన్ కళ్యాణ్‌లు ప్రచారంలో నిమగ్నమై వుండగా, నాగబాబు పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. వీరికి మద్దతుగా సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి ఉండనే ఉన్నారు.

ఇకపోతే.. కాంగ్రెస్ విషయానికి వస్తే కృష్ణ, మోహన్‌బాబు, రాజశేఖర్, జీవిత, జయసుధ, శారద, జయసుధ, శ్రీహరి, కృష్ణంరాజు?లు ఉన్నారు. పరోక్షంగా యువసామ్రాట్ నాగార్జున, ప్రిన్స్ మహేష్ బాబులు కాంగ్రెస్‌కు పరోక్ష మద్దతు తెలిపారు. జాతీయ పార్టీ భాజపా తరపున నరేష్, తెలంగాణా రాష్ట్ర సమితికి మద్దతుగా విజయశాంతిలు ఉండనే ఉన్నారు.

మొత్తం మీద రాష్ట్ర రాజకీయ చిత్రపటం, ఇపుడు తారాగణంతో తళతళలాడుతోంది. రాష్ట్రంలో ఎటు చూసినా.. ఎక్కడ చూసినా తారాతోరణ రోడ్‌షోలతో సందడే సందడిగా ఉంది. తారల నోటివెంట రాజకీయ మాటలు రావడమే అబ్బురంగా భావించే దశ నుంచి రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం పదుల సంఖ్యలో నటులు ఎన్నికల సమరంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్న తీరును చూస్తున్నారు. వెండితెరపై నటించే పాత్రలకు జీవం పోసే తారాతోరణం, ప్రజల జీవితాల్లో ఎంతమేరకు వెలుగులు నింపుతారో కాలమే సమాధానం చెప్పాలి.

No comments:

Post a Comment