మజ్లిస్‌ గెలుపు కష్టమేనా?

పాతబస్తీలో రెండున్నర దశాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్న మజ్లిస్‌ పార్టీ వచ్చే జమిలీ ఎన్నికల్లో విజయం సాధించడం ఇదివరకటిలా నల్లేరుమీద నడకకాదని మారిన రాజకీయ సమీకరణలు చెబుతున్నాయి. ఇన్నాళ్లు కేవలం ముస్లిం ఓటు బ్యాంకు మీద ఆధారపడి గెలుపు గుర్రంపై స్వారీ చేస్తూ వచ్చిన మజ్లిస్‌ పార్టీపై ఈసారి ముస్లింలలో ఒక వర్గం గుర్రుగా ఉండడంతో పాటు ఎంఐఎం వ్యతిరేక పార్టీలు కొంత బలం పుంజుకోవడం ఆ పార్టీకి కష్టం తెచ్చిపెట్టే అవకాశాలు వున్నాయి. ఇప్పుడున్న పరిస్థి తుల్లో ఒక్క బహదూర్‌పురా నియోజకవర్గం మినహా మిగతా అన్ని స్థానాలలో మజ్లిస్‌ గట్టి పోటీని ఎదుర్కునే అవకాశాలున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే మజ్లిస్‌ వ్యతిరేక ఓటు ఏకమైతే ఆ పార్టీ కోటకు బీటలు తప్పవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాతబస్తీ అంటే మజ్లిస్‌ అని అందరూ అనుకోవడం తెలిసిందే. దీనికి తగ్గట్లుగా ఇక్కడి అన్ని అసెంబ్లీ స్థానాలతో పాటు మూసీనది పశ్చిమ తీరాన గల మరో మూడు స్థానాలలోనూ మజ్లిస్‌ హవా కొనసాగుతూ వచ్చింది. అన్నీ సవ్యంగా జరిగితే వచ్చే ఎన్నికల్లో పాతబస్తీలోని ఆరు స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఇందు కోసం ఆ పార్టీ కాంగ్రెస్‌తో రహస్య అవగాహన కూడా కుదుర్చుకుంది. అయితే ఇంతా చేస్తే మజ్లిస్‌ విజయావకాశాలు ఆ పార్టీ అనుకున్నంత స్థాయిలో లేవని అక్కడి పరిస్థితులు సూచిస్తున్నాయి.

No comments:

Post a Comment