ఒకప్పుడు రాజకీయాలంటే ప్రజలకు జవాబుదారీగా ఉండే ఓ నిఖార్సయిన కూటమి అనే విలువ ఉండేది. నేడు ఆ విలువ దాదాపు తుంగలో తొక్కినట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు అనేక వాగ్దానాలతో ప్రజలకు అరచేతిలో వైకుంఠాన్ని చూపే పార్టీలు, ఆ తర్వాత ఆ హామీల సంగతే మర్చిపోతున్నాయి. కాదు... కాదు మర్చిపోతున్నట్లు నటిస్తున్నాయి.
అసలు ఇప్పుడు రాజకీయం అంటే కేవలం డబ్బు సంపాదనకుగల ఓ మహత్తరమైన అవకాశంగా మారిపోయింది. సామాన్య ప్రజలకు రాజకీయాలలో నేడు చోటు లేదు. పార్లమెంటు స్థానానికి బరిలో దిగే నేతకు కనీసం పదికోట్ల రూపాయల విలువ గల ఆస్తి సత్తా ఉండాలంటున్నారట.
ఇక అసెంబ్లీకైతే కనీసం అందులో సగం... అంటే ఐదు కోట్ల రూపాయలు హార్డ్ క్యాష్ ఉన్నట్లు దాఖలాలు కనబడితేనే సీటు ఖాయమవుతుందట. ఇదీ ఇప్పుడు రాజకీయాల్లో ఆయా సీట్లను ఆశించే కొందరు నేతలు చెపుతున్న మాట.
ఏ వ్యాపారంలో అయినా ఒక్క రూపాయి పెట్టుబడిగా పెట్టినా దానికి రెట్టింపు లాభాన్ని ఆశించడం సహజం. మరి అలాంటిది పార్లమెంటుకు పదికోట్లు, అసెంబ్లీకి ఐదు కోట్లు పెట్టుబడి పెడితే, దానిపై రెట్టింపు లాభాన్ని అభ్యర్థులు ఆశిస్తున్నట్లే అని మనం అర్థం చేసుకోవాలి. ఈ సంస్కృతి ఇలా కొనసాగి చివరికి ఏ దశకు చేరుకుంటుందోనని నాటితరం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఖద్దరు చొక్కా, ధోవతి ధరించి జనం కోసం పాటుపడిన నేతలు కనుమరుగై కేవలం ధనాపేక్షతో రాజకీయాల్లోకి వచ్చేవారు ఎక్కువవుతున్నట్లు తెలుస్తోంది. కొందరు నేతలైతే వచ్చిన ఆదాయం చాలక, ప్రజలకు చెందాల్సిన సొమ్మును ఎడాపెడా మేసేస్తూ అవినీతి నిరోధక శాఖకు పట్టుపడుతున్న సందర్భాలు అనేకం.
రాజకీయాల్లో ఈ సంస్కృతిని మార్చాల్సిన బాధ్యత ఆయా పార్టీలదే. ఒకవేళ ఈ సూత్రాన్ని రాజకీయ పార్టీలు విస్మరిస్తే, ఆ బాధ్యత ఓటర్లపైనే ఉంటుంది. ఏ పార్టీలోని అభ్యర్థులు అవినీతి రహిత చరిత్ర కలిగి ఉంటారో వారిని ఎన్నుకున్నప్పుడే నిజమైన అభివృద్ధి జరుగుతుంది.
కనుక ఈ దిశగా ప్రతి ఒక్క ఓటరూ యోచించాల్సిన సమయం ఆసన్నమైంది. భవిష్యత్ మన చేతిలోనే ఉంది. అర్హతలేని అభ్యర్థిని అందలం ఎక్కిస్తే.. ఐదేళ్లూ అభివృద్ధికి నోచుకోక అంధకారంలో గడపాల్సి వస్తుంది. డబ్బు సంపాదనే ప్రధాన లక్ష్యంగా, ఆకాశమే హద్దుగా రాజకీయాలలోకి వస్తున్న అభ్యర్థిని నిలువరించగల "కీ" మీ వద్దే ఉందని మరువకండి. ధనాపేక్షకు తాళం వేసి అభివృద్ధినివ్వగల నాయకుడిని ఎన్నుకోవడమే మీ ప్రధాన కర్తవ్యం.
No comments:
Post a Comment