ఎన్నికల తేదీలు దగ్గరపడుతుండడంతో రాష్ట్రంలోని అన్ని పార్టీలు బరిలో నిలిపే అభ్యర్థుల జాబితాలను దాదాపు పూర్తి చేశాయి. కానీ ఎవ్వరూ మా జాబితా ఇది అని ధైర్యంగా ప్రకటించలేకపోతున్నారు. అధికార కాంగ్రెస్‌తో సహా టీడీపీ, పీఆర్పీ, వామపక్షాలు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించలేకపోతున్నాయి. భారతీయ జనతా పార్టీ, లోక్‌సత్తా పార్టీలు మాత్రమే మున్ముందుగా అధికారిక జాబితాలో కొన్ని పేర్లయినా విడుదల చేశాయి. ప్రజారాజ్యం పార్టీకి మాత్రం ముందుగా ఎవరైనా విడుదల చేస్తే, టికెట్లు రానివారు తమవైపు చూడక పోతారా అన్నట్లు ఉంది. మిగిలిన పార్టీలన్నీ తాము కాకుండా ఎవరు ముందు విడుదల చేస్తారా అని ఎదురు చూస్తున్నాయి. దీనికి ఒకే కారణం...తాము ముందే చిట్టా విప్పితే...నిరాశా జీవులు గోడ దూకుతారేమో అనే వణుకుతోనే అన్ని పార్టీలూ ప్రకటించిన తర్వాత విడుదల చేస్తే దాన్ని నివారించవచ్చునేమో అన్న ఆశ. ఇటు టికెట్లు ఆశిస్తున్న వారు మాత్రం అభ్యర్థిని ప్రకటిస్తే ప్రచారంపై దృష్టిపెట్టవచ్చని చూస్తున్నారు.
కాంగ్రెస్ ధీమా...
ఐదేళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకత లేదని మళ్లీ అధికారం తమదే అని నమ్ముతోంది. అయితే కొన్నికారణాల వల్ల 70 మంది సిట్టింగ్‌లకు టికెట్లు లభించే సూచనలు లేవు. ఎన్నికల వేళ ఎప్పుడు ఏమవుతుందో అనే ఆలోచనతో కూడిన వణుకు కాంగ్రెస్ నాయకత్వానికి లోలోపల ఉంది సిట్టింగు ఎమ్మెల్యేలను మార్చక తప్పకపోవడంతో టికెట్లు రాని వారు ఇండిపెండెంట్లుగా, మరో పార్టీ తరఫున పోటీచేసి గెలిచే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ జాబితా విడుదల వాయిదా వేసింది. అలాగే టీఆర్‌ఎస్ అసమ్మతి ఎమ్మెల్యేలుగా ఉండి, కాంగ్రెస్‌కు సన్నిహితంగా మెలిగిన దుగ్యాల శ్రీనివాసరావు, జగ్గారెడ్డి లేదా ఆయన సతీమణి లాంటి వారికి సైతం టికెట్లు ఖాయమయ్యాయన్న వార్తలు ఇప్పటికే వచ్చాయి. అలాంటి వారందరికీ టికెట్లు ఇచ్చినట్టు వెంటనే అధికారికంగా ప్రకటిస్తే లేనిపోని తలనొప్పులు చుట్టుకుంటాయన్న ఆందోళన కాంగ్రెస్ నాయకత్వాన్ని వెంటాడుతున్నది. తుది కసరత్తు పూర్తి చేసిన తర్వాత అధినేత్రి సోనియాగాంధీ అంగీకారంతో ఈనెల 23న జాబితా విడుదల చేస్తామని డిఎస్, వైఎస్ చెబుతున్నారు.
సర్ధుబాటులో కూటమి...
ఇక ఎలాగైనా కాంగ్రెస్‌ను గద్దె దించాలన్న లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో ఏకమైన టిఆర్‌ఎస్, సిపిఎం, సిపిఐ నాయకత్వాలు ఎడతెగని సర్దుబాటు చర్చలు సాగిస్తూ, వాటి ఫలితాలు తేలక సతమతమవుతున్నాయి. అంతర్గతంగా పార్టీ జాబితాలు రూపొందించు కోవటం, సర్దుబాట్ల కారణంగా టికెట్లు ఇవ్వలేని వారిని అనునయ వాక్యాలతో ఈ ఒక్కసారి సర్దుకొమ్మని చెప్పి పని చేయించుకోవటం వంటి పనులు టిడిపి, టిఆర్‌ఎస్‌కు అదనంగా ఉంటాయి. జెండా మోసిన వారికే ప్రాధాన్యం ఇవ్వాలన్న డిమాండ్‌ను ముందుకు తీసుకువచ్చినా నాయకత్వాలు వినకుండా కొత్తగా పార్టీలోకి దూకిన వారికి అవకాశాలు ఇస్తున్నారన్న ఆక్రోశం నాయకులలో కలుగుతున్నది. ఈ పరిణామాలన్నిటినీ గమనిస్తున్న కూటమి నాయకత్వాలు కాంగ్రెస్, పిఆర్పీ జాబితాలను చూసిన తర్వాతే విడుదల చేయాలని కూటమి నాయకత్వాలు భావిస్తున్నట్టు సమాచారం. ఈనెల 22న లేదా ఆ తర్వాత జాబితాలను విడుదల చేయాలని, ఆ లోగా అంతర్గతంగా సర్దుబాట్లు పూర్తి చేసుకోవాలని కూటమి నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం.
జంపింగ్‌ల కోసం పీఆర్పీ...
కాంగ్రెస్, కూటమి జాబితాల పంచాయతీ తెగితే టికెట్లు రాని వారంతా తమ పార్టీ వైపు దూకటం ఖాయమని పిఆర్పీ ఎదురు చూస్తున్నది. అనేక జిల్లాల్లో మహాకూటమి, కాంగ్రెస్ అభ్యర్థులను ఢీకొనగలిగిన నేతలు ఇంకా అందుబాటులోకి రాకపోవటంతో రెండు వైపులనుంచి టికెట్లు రానివారికి గాలం వేయ వచ్చునని పిఆర్పీ నాయకత్వం ఆశిస్తున్నది. ఇప్పటి వరకు చిరంజీవి ప్రజాఅంకిత యాత్రలో ముగ్గురి పేర్లు అధికారికంగా ప్రకటించారు. అనుకున్నట్టు జరిగితే ఈ నెల 23న లేదా తర్వాత జాబితా విడుదల చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.
బీజెపీ, లోక్‌సత్తాలే నయం..
జాబితాల విడుదల విషయంలో బిజెపి, లోక్‌సత్తా కొంతలో కొంత నయం. బిజెపి ఇప్పటిదాక 100 అసెంబ్లీ, 15 లోక్‌సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ నెల 23 నాటికి పూర్తి స్థాయి జాబితా విడుదల చేస్తామని బిజెపి అంటున్నది. ఇక లోక్‌సత్తా ఇప్పటిదాకా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ పేరు సహా 38 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇలా ఎవరికి వారు పక్క పార్టీని చూస్తూ కూర్చుంటే లాభం లేదని ఆశావహులు కాస్త గట్టిగానే మాట్లాడుతున్నారు. ఎన్నికలు జరగటానికి నెల రోజుల గడువు కూడా లేకపోవటంతో ఏర్పాట్లు చేసుకోవటానికి తమకు వీలు చిక్కదని, తమ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని వెంటనే జాబితాలను ప్రకటించాలని అన్ని పార్టీలలో టికెట్లు ఆశిస్తున్న వారు మొర పెట్టుకుంటున్నారు.
No comments:
Post a Comment