ఉద్యమ కాలం నుంచీ తెలంగాణలో ఆబాలగోపాలం అందెశ్రీ ‘జయ జయ హే తెలంగాణ’ గీతాన్ని పాడుతున్నారు. అసంఖ్యాక తెలంగాణ ప్రవాసుల సెల్ ఫోన్లకు ఇది రింగ్ టోన్ గా ఉంది. ఈ స్ఫూర్తిదాయక గేయాన్ని, పొరాడి సాధించుకున్న తెలంగాణలో రాష్ట్ర గీతంగా ఎందుకు ప్రకటించడం లేదు?
ఏ ప్రజా ఉద్యమంలోనైనా సాంస్కృతిక కార్యక్రమాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది, ప్రత్యేకించి గేయాలు ఉద్యమ ఉత్తేజాన్ని రక్తికట్టించే స్ఫూర్తిని రగిలిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగునాట ఎన్టీఆర్ చైతన్య రథం పై కదులుతుంటే వినిపించిన ‘చేయెత్తి జై కొట్టు తెలుగోడా’ అనే గేయం అశేష ప్రజలను చైతన్యపరిచింది.
స్వాతంత్య్ర పోరాట కాలంలో పంజాబీ యువతకు స్ఫూర్తినిచ్చిన ‘ మేరా రంగ్ దే బసంతి’ కి, నక్సలైట్ల విప్లవ గీతాలకు, నేటి ‘జయ జయ హే తెలంగాణ’, ‘జననీ జయకేతనమా తెలంగాణ’ మొదలైన గేయాలకు ప్రజల మనసుల్లో సహజంగానే ఒక బలమైన, చెరిగిపోని స్ధానం ఉంటుంది. ఉద్యమ స్ఫూర్తితో రచించిన గేయాలు కాబట్టి పేరు, ప్రతిష్ఠల వివాదాలకు తావు లేకుండా ప్రజల హృదయాలలో స్ధానం సంపాదించుకుంటాయి.
ఈ స్ఫూర్తిదాయక గేయాలకు స్ధానికంగా కంటే విదేశాలలో ఉంటున్న వారిలో మరింత ఎక్కువ ఆదరణ లభించడం కద్దు. అందుకే లాహోర్ లో భగత్ సింగ్ ఉరికంబం ఎక్కడానికి నడుచుకొంటూ పాడిన రంగ్ దే బసంతి అనే పాట పంజాబ్‌లో కంటే ఎక్కువగా ఆ కాలంలో కెనడాలో మారు మ్రోగింది. ఈ గేయ రచయిత రాంప్రసాద్ బిస్మిల్. అయితే దీన్ని ఆయనతో కంటే ఎక్కువగా భగత్ సింగ్ తోనే కలిపి చూస్తారు. స్వతహాగా రాంప్రసాద్ పరిపూర్ణ జాతీయవాదేకాక విప్లవవాది కూడా. తత్కారణంగా రంగ్ దే బసంతిగీతం విషయంలో తనను విస్మరించడాన్ని ఆయన పట్టించుకోలేదు. పైగా రంగ్ దే బసంతి మారుమ్రోగే నాటికి భగత్‌సింగ్‌ని బ్రిటిషు పాలకులు ఉరి తీసారు.
చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా! అనే గేయాన్ని రచించింది కమ్యూనిస్టు నాయకుడు వేములపల్లి శ్రీకృష్ణ అయినా ఆయనకు ఎన్టీఆర్‌కు మధ్య పేరు, ప్రతిష్ఠ సమస్య ఉత్పన్నం కాలేదు. ప్రసార మాధ్యమాలు లేని ఆ కాలంలో దాని రచయిత శ్రీకృష్ణ అని సాహితీప్రియులకు తప్ప సామాన్యులకు తెలియదు.
రచయితలపై గౌరవం, గేయాలలోని ఆంశాలు, వాటికున్న నేపథ్యం, ప్రజాదరణ కారణాన ఎవరూ ఈ రకమైన సందర్భాలలో పంతాలకు పోవడంతక్కువ. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ‘అమర్ సోనార్ బంగ్లా గేయం బంగ్లాదేశ్ జాతీయ గీతంగా ఉంది. ఉర్దూ మహా కవి ఇక్బాల్ భారత దేశాన్ని కీర్తిస్తూ రచించిన ‘సారే జాహ సే అచ్ఛా...’ గీతాన్ని భారతదేశంలో ఇప్పటికీ పాడుతారు. బెజవాడ గోపాలరెడ్డి దీన్ని తెలుగులోకి అనువదించారు. ముఖ్యమంత్రిగా ఎన్ టి రామారావు అనేక సార్లు ఈ స్ఫూర్తిదాయక గీతాన్ని సభల్లో పాడారు. ఇక్కడ గేయానికి ప్రాధాన్యత ఉంది తప్ప, దాని రచయిత జోలికి ఎవరూ వెళ్ళడం లేదు. అది స్ఫూర్తి.. వందేమాతరం బెంగాల్‌ను ఒక ఊపు ఊపింది.
తన సంస్కృతి, ఉద్యమాన్ని ప్రస్ఫుటించడానికి ప్రయత్నిస్తున్న నూతన తెలంగాణ రాష్ట్రం వైపు వద్దాం. తెలంగాణ ఉద్యమంలో సాంస్కృతిక కార్యక్రమాలు, పాటల పాత్ర విశేషం. చిన్నారి మధు ప్రియ నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరి పాత్రకు ప్రాధాన్యముంది. తన ప్రప్రథమ విదేశీ పర్యటన అయిన దుబాయిలో రసమయి బాలకిషన్ గేయాలను వినడానికి వచ్చిన జనాల సంఖ్య ఇప్పటికి ఈ గల్ఫ్ రాజ్యంలోని ఆసియాదేశస్ధుల చరిత్రలో చెప్పుకోదగ్గ విషయమే. అందెశ్రీ రచించిన ‘జయ జయ హే తెలంగాణ! జననీ జయ కేతనం’ గీతం అటు తెలంగాణ గడ్డతో పాటు విదేశాలలో ఉన్న తెలంగాణ వాసులను ఉత్తేజ పరిచింది, విదేశాలలో ఇప్పటికీ జయ జయ హే తెలంగాణ హిట్ రికార్డే.
తెలుగు సరిగ్గా రాని నా చిన్నారి బిడ్డ కూడ దీన్ని సరదాగా పాడుతుంది. ఈ గేయం నచ్చిన అనేక మంది మేధావులతో పాటుగా స్వయాన కేసీఆర్ కూడ ఇందులో కొన్ని సవరణలు చేస్తూ దాన్ని మరింత ఉత్తేజకరంగా రూపొందించారు. తెలంగాణ తొలి శాసన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయాన ఈ విషయాన్ని చెప్పారు. కేసీఆర్ విమర్శలు, ప్రొఫెసర్ జయశంకర్ ప్రసంగాలు, అందె శ్రీ గేయం, రసమయి గజ్జెలు ఉత్తేజంతో విదేశాలలోని తెలంగాణ ప్రవాసులలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి రగిలింది. అమెరికాతో పాటు మరికొన్ని దేశాలలోని తెలంగాణ సంఘాలు తమ వెబ్ సైట్లలో జయ జయ హే తెలంగాణ గేయాన్ని ఇంటర్నెట్ ద్వారా డౌన్ లౌడ్ చేసుకోనే సదుపాయాన్ని కూడ కల్పించాయి. తెలంగాణ ప్రవాసులు ఆసక్తిగా గమనించిన తెలంగాణ ఉద్యమ సన్నివేశాలలో అందె శ్రీ పాడిన ఈ గేయం ఒకటి.
తెలంగాణ ఉద్యమ కాలం మొదలు నేటి వరకు పాఠశాలల్లో జయ జయ హే తెలంగాణ అంటూ పాడుతున్నారు. విదేశాలలో వేలాది మంది సెల్ ఫోన్లకు ఇది రింగ్ టోన్ గా ఉంది. మరీ అంతగా ప్రాధాన్యమున్న ఆ గేయాన్ని, పొరాడి సాధించుకున్న తెలంగాణలో రాష్ట్ర గీతంగా ఎందుకు ప్రకటించడం లేదు? అశేష తెలంగాణ ప్రజలు ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న ఇది.
No comments:
Post a Comment