OpEd: ప్రజలు ఆశిస్తున్నదేమిటి, బాబు చేస్తున్నదేమిటి?

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరమైంది. ఈ సంవత్సర కాలంలో సామాన్య ప్రజలకు మేలు చెయ్యని కార్యక్రమాలే తప్పించి ఆంధ్రులు ఆశించిన కార్యక్రమాలేవి జరిగిన దాఖలా లు లేవు. అనవసరపు మాటలు, ఆర్భాటపు విదేశీ పర్యటనలు, రెండు దశాబ్దాల కాలమైన తీర్చలేని కలలు, తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు అభ్యర్థుల మీద ఎదురు దాడులు. ఇది చంద్రబాబు సంవత్సర కాలంగా నడిపిస్తున్న ప్రభుత్వం.

ఒక కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు దానిని ఎలా నడపాలో అందులో ఎదురయ్యే కష్టనష్టాలు ఏమిటో చంద్రబాబుకు అవగాహన లేదు. విభజనవల్ల ఆర్థికంగా ఇతరత్రా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రుల మనోభావాలు చంద్రబాబుకి అస్సలు పట్టలేదు. అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు పుట్టిందో, దాని వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ భావజాలం ఎటువంటిదో చంద్రబాబు మరిచిపోయారు. మహానాడు అంటే సుదీర్ఘ చర్చలు, అర్థవంతమైన సూచనలు వడిగట్టి చేసే తీర్మానాలుగా ఎన్టీఆర్‌ హయాంలో జరిగేవి. కానీ నేడు మహానాడును పచ్చకండువాల తిరణాల స్థాయికి దిగజార్చారు.


ఎన్టీఆర్‌ జీవించి వుంటే పరిస్థితులను ఎలా ఎదుర్కొని వుండేవారు అన్నది ఒక్కసారైనా మహానాడు వేదిక మీద ఆలోచన చేశారా అన్నది సందేహమే! రాష్ట్ర విభజనలో జరిగిన అన్యాయాన్ని ఎన్టీఆర్‌ సహించి ఊరుకుని వుండేవారా! ఢిల్లీ పీఠం మీదికి ఈ పాటికి తీవ్రపదజాలంతో దాడిచేసే వారు కాదా! ఢిల్లీలో మిత్రపక్షమే అయినప్పటికీ తనకు రావాల్సిన దానిని అడిగే పిరికితనం ఎన్టీఆర్‌కి వుండేది కాదు. ఎందుకంటే ఎన్టీఆర్‌ది గుండె ధైర్యం. తనకు ఏమి జరిగినా ప్రజల మధ్యకు వెళ్ళగలిగిన మహానాయకుడు ఆయన. నిజాయితీగా తప్పులు అంగీకరించి, నిర్మొహమాటంగా ఎదుటివారి తప్పులను ఎండగట్టి వుండేవారు. ఎన్టీఆర్‌ వ్యక్తిత్వానికి భిన్నంగా కుయుక్తులు, ఎన్నికలలో గెలుపు ముఖ్య లక్ష్యంగా రాజకీయ జీవనం గడిపే చంద్రబాబు దగ్గర అటువంటి సాహసం ఆశించటం తప్పేమో! తీర్చలేని హామీలు, హేతుబద్ధం కాని కలలు చంద్రబాబు చేశారు, చేస్తున్నారు. రాష్ట్రం విడిపోతున్నదని తెలుసు. విడిపోతే ఆర్థికంగా ఎంత లోటు ఏర్పడుతుందో తెలుసు. అయినా ఎన్నికల్లో గెలుపు కోసం రుణమాఫీ హామీ చేశారు. ఇప్పుడు హామీలను తీర్చలేక, హామీల అంశం మరుగుపరిచి, మాయచేసి వెనక్కి తగ్గేందుకు వీలైన వక్రమార్గాలు వెతుక్కుంటున్నారు. ఇది తెలుగు ప్రజలకు చేస్తున్న మహాద్రోహం.

ఎన్ని విదేశాలు వెళ్ళి వచ్చారు! ఎన్ని పెట్టుబడులు తెచ్చారు. గతంలో 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆయన చేసిన విదేశీ పర్యటనలు, తాను దావోస్‌లో హీరోనని చెప్పుకున్న చంద్రబాబు వల్ల ఆంధ్రప్రదేశ్‌కి వచ్చిన పెట్టుబడులు ఎన్ని? ఇప్పుడు వచ్చేవి ఎన్ని? నాడు వచ్చింది, నేడు కురిసేది కబుర్లే కానీ పెట్టుబడులు కావు.
ముఖ్యమంత్రి 2019 నాటికి ఏం చెయ్యబోతున్నది చెప్పరు. విభజన చట్టంలోని లోపాలను గురించి అడగరు. ఆంధ్రులకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించరు. అప్పులు ఒక దామాషా, ఆస్తులు మరో దామాషా. విద్యుత్‌ వినియోగం మరిండు పద్ధతిలో పంపకం ఏమిటని నిలదీయరు? ఆంధ్రులు ఆశిస్తున్నవి ఏమీ చెయ్యరు. తనకు తోచినవి తన ఆప్తవర్గానికి అనుకూలమైనవి చేసుకుంటూ పోతుంటారు.

రాష్ట్రంలోని ఇతర రాజకీయ పక్షాలను కలుపుకుని పోవటం లేదు. ఒంటెద్దు పోకడ వల్ల ఎవరికి నష్టం? రాజధాని విషయంలోనే కాదు మరే విషయంలో అసెంబ్లీకి ఆవల ప్రతిపక్షాల మధ్య చర్చలు లేవు. రాష్ట్రంలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయంలో అన్ని పార్టీలను కలుపుకుని ఢిల్లీకి వెళ్ళరు.

కానీ రాష్ట్రంలో మూడు పంటలు పండే 30వేల ఎకరాలను ఒక్కసారిగా కబళించగలరు. ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా భూములు సేకరిస్తారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఆయన ప్రకటించే ప్రకటనలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. మంచి బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌ లేనిచోట ఎయిర్‌ పోర్టులు నిర్మిస్తారట. కుప్పం నుంచి విమానం ఎక్కే వారెందరు? అటు తిరుపతి, బెంగుళూరు, మద్రాసు విమానాశ్రయాలుండగా కుప్పంలో మరో విమానాశ్రయం అవసరమా! కుప్పం వారంతా విమానం ఎక్కి తిరుపతికి వస్తారని చంద్రబాబు భావిస్తున్నారా! ప్రజల దగ్గరున్న భూములు లాగేసుకుని, కాంక్రీట్‌ నిర్మాణాలు చేపట్టేటువంటివి. లక్షల మంది నిర్వాసహీనులైనా ఫరవాలేదు అస్మదీయులకు రాజధాని ప్రాంతంలో ఖరీదైన భూములు కట్టబెట్టాలి అన్నది చంద్రబాబు ఆలోచన.

ఆంధ్రులు ఏమి ఆశిస్తున్నారో ఎన్నడైనా చంద్రబాబు అడిగారా! ప్రతిపక్షాలను వదిలేయ్‌ కాని కనీసం వివిధ వర్గాల వారితో సమావేశమయ్యారా! మనం ఏమి చేస్తే కోల్పోయిన దానిని తిరిగి సంపాదించుకోగలమన్న దానిమీద చర్చ జరిపారా! 2004కి ముందు నుంచి ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చేసిన హామీలు ఏమిటో బాబుకి గుర్తున్నదా! వాటిని ఎం దుకు అమలు చేయలేకపోయింది ఎప్పుడైనా ఆలోచించారా!ల అంశఅ4?్ద
చంద్రబాబు స్టయిల్‌ ఒక సినిమాలో రావుగోపాలరావు పాత్ర చెప్పిన ‘చరిత్ర అడక్కు చెప్పింది విను’ అనే విధంగా సాగుతోంది. మీ పాలనలో అభివృద్ధి మొత్తం హైదరాబాద్‌ మీద ఎందుకు కేంద్రీకరించావు? అంటే సమాధానం చెప్పరు. ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలలో రైలుమార్గాల మీద ఫ్లై ఓవర్స్‌ వున్నాయి తప్పించి రోడ్డు ట్రాఫిక్‌ సమస్యల నియంత్రణకు ఫ్లై ఓవర్స్‌ నిర్మాణం జరిగిందా! రాష్ట్రంలో 16 ఫ్లై ఓవర్ల నిర్మాణాలు చంద్రబాబు హయాంలో చేపడితే అవన్నీ హైదరాబాద్‌ నగరంలోనే ఎందుకు చేపట్టారు? ఈ ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పరు. విద్యాలయాలన్నీ అక్కడే ఎందుకు పెట్టారంటే అటు ఇటు చూస్తారే గానీ పెదవి విప్పరు.
‘మీకు చేతకాకపోతే తప్పుకుని మాకు అవకాశం ఇవ్వండి ఆరు నెలల్లో విజయవాడ కనకదుర్గ గుడి దగ్గర ఫ్లై ఓవర్‌ కట్టి ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం చేస్తా’ అంటూ ప్రతిపక్షంలో వుండగా చంద్రబాబు విసిరిన సవాలు ఏమైంది. అధికారంలోకి వచ్చి సంవత్సరమైనా శంకుస్థాపన చెయ్యలేదే!

1990 నుంచి వాగ్దానం చేసే బందర్‌ రోడ్డు గురించి ఏమీ చెప్పరేం! ఇటువంటివి ఒకటి కాదు రెండు కాదు చంద్రబాబు గురించి చెప్పాలంటే చాలా వున్నాయి.

తనకు తోచినవి తాను చేసుకుంటూ పోతానంటే తమకు నచ్చిన మరో నాయకుడువెంట ఓటరువెళ్ళిపోతాడు. ఆంధ్రులు ఆశిస్తున్నది వారి ఆత్మగౌరవం నిలబడాలనేది. అది ఒకనాటి టీడీపీ నినాదం కాబట్టి అందుకోసం ఆ పార్టీ కృషి చేస్తుందనే నమ్మకంతో చంద్రబాబును గెలిపించారు. ఇది ఆయన అర్థం చేసుకోవటం లేదు. ఆంధ్రులు గర్వంగా తలెత్తుకోదగిన పని ఒక్కటి ఈ సంవత్సర కాలంలో చేశానని చంద్రబాబు చెప్పగలరా! కనీసం ఆంధ్రలో పుట్టి హైదరాబాద్‌కి తరలించుక వెళ్ళబడి, వేర్పాటు ఉద్యమ సమయంలో తారుపూయబడిన ఆంధ్ర బ్యాంక్‌ ప్రధాన కార్యాలయం తిరిగి మచిలీపట్నంకి మార్చాలని చంద్రబాబు ఎందుకు అడగరు? అదేమి అంత గొప్పవిషయం కాదు కదా! మచిలీపట్నం నుంచి హైదరాబాద్‌కి తరలించిన తీరులోనే తిరిగి వెనక్కి తీసుకురావొచ్చు కదా!

అలాగే హైకోర్టును వెంటనే ఎందుకు గుంటూరుకు తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యరు. గుంటూరు విజయవాడల్లో హైకోర్టుకు అనువైన నిర్మాణాలు లేవా! లేకపోవటానికి మీ గత పాలన కారణం కాదా! కలెక్టర్ల సమావేశానికి తగిన వేదిక లేక ఒక హోటల్‌ని ఆశ్రయించాల్సిన గతి విజయవాడకు పట్టించింది చంద్రబాబు, కాంగ్రెస్‌ నేతల పాలనే కదా! ఇప్పుడు కూడా చంద్రబాబు ఆలోచనా ధోరణి మారలేదు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఆంధ్రులు ఆశిస్తుంటే మరో హైదరాబాద్‌ని తుళ్ళూరులో దించుతానంటున్నారు. హైదరాబాద్‌ అభివృద్ధికి మూసీనది మురికి కాలువ అయింది. ఇప్పుడు కొత్త రాజధాని అభివృద్ధి పేరిట కృష్ణానదిని కంపు కొట్టించాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి. ఇది ఆంధ్రులు కోరుకోని అభివృద్ధి.

హైదరాబాద్‌లో తన పేషీ అలంకరణకు, తన నివాసం నగిషీలకు, భద్రతకు చేస్తున్న ఖర్చంతా వృథానే కదా. తనది కాని స్థలంలో కోట్లు కుమ్మరించే వారెవరైనా వుంటారా! అదే తన సొంత సొమ్మును అలా వృథా చేస్తారా చంద్రబాబు నాయుడు. ప్రజల సొమ్ము కాబట్టి ఎంత దుబారా చేసినా చెల్లిపోతుందనుకుంటున్నారు. ఒకవైపు జీతాలు కూడా ఇవ్వలేని ఆర్థికస్థితి అని, కేంద్రమే ఆదుకోవాలని బీద ఏడుపులు ఏడుస్తూ మరోవైపు ప్రపంచస్థాయి నగరం, కృష్ణానది మీద ఐదు వంతెనలు, ఆకాశ హర్మ్యాలు, మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు... అబ్బబ్బో ఈ పగటివేష కబుర్లువినలేక చస్తున్నారు ఆంధ్రులు. ఇప్పటికైనా తాను చేయదలచుకున్నది ఆపి, ఆంధ్రులు ఆశించేవి ఏమిటో తెలుసుకునే యత్నం చెయ్యటం మంచిది.

No comments:

Post a Comment