ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలనే డిమాండ్‌తో తెలంగాణలోని అర్చక ఉద్యోగుల జేఏసీ తలపెట్టిన సమ్మె గురువారం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని ఆలయాల అర్చక, ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ప్రాతఃకాల పూజల అనంతరం ఆలయ అర్చకులు, ఉద్యోగులు విధులు బహిష్కరించి నల్లబ్యాడ్జీలు ధరించి తమ నిరసన తెలియజేశారు. ఆర్జిత సేవలను నిలిపివేశారు. పలుచోట్ల దేవాలయాలను మూసివేశారు.
ఉదాహరణకు.. ఒక్క నల్గొండ జిల్లాలోనే 1100 ఆలయాలను మూసివేశారు. సమ్మెకు సీపీఎం తెలంగాణ కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ప్రభుత్వం వెంటనే స్పందించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేశారు. పార్టీ అనుబంధ కార్మిక సంఘం.. సీఐటీయూ తెలంగాణ కమిటీ కూడా ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపింది.
ఇక.. అర్చకులంటే సీఎంకు వల్లమాలిన ప్రేమ అని, గోటితో పోయే ఈ చిన్న సమస్య అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం వల్లే గొడ్డలిదాకా వచ్చిందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. హైదరాబాద్‌లోని చిక్కడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద దేవాలయ అర్చక, ఉద్యోగులు గురువారం సమ్మె నిర్వహించగా, వారితోపాటు ఆలయ పధ్రాన ద్వారం వద్ద బైఠాయించిన కోదండ.. వారికి సంఘీభావం ప్రకటించారు. సమ్మెకు మద్దతు పలికిన బీజేపీ శాసనసభాపక్ష నేత కె.లక్ష్మణ్ కూడా.. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ సమస్య ఇంతదూరం వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ నుంచి స్వయంగా ప్రకటన వచ్చేదాకా సమ్మె ఆగదని తెలంగాణ దేవాలయాల అర్చక, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చిన్నం మోహన్ స్పష్టం చేశారు.
మరోవైపు.. ప్రభుత్వం అర్చకుల సమస్యల పట్ల సానుకూలంగా ఉన్నందున అర్చకులెవరూ గంగు భానుమూర్తి పిలుపునిచ్చిన ఈ సమ్మెలో పాల్గొనవద్దని టీఆర్‌ఎస్ బ్రాహ్మణ అర్చక సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాహుల్ దేశ్‌పాండే కోరారు. గంగు భానుమూర్తి పిలుపునిచ్చిన అర్చకుల సమ్మె విఫలమైందని తెలంగాణ దేవాదాయ అర్చక సమాఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేందర్ శర్మ అన్నారు.
ట్రెజరీ ద్వారా వేతనాల చెల్లింపు, దూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తాన్ని రూ. 6 వేలకు పెంచడం, అర్చక, ఉద్యోగులను పర్మనెంట్ చేయడం సహా ప్రభుత్వం ముందు ఉంచిన ఇతర సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకూ సమ్మె కొనసాగుతుందని తెలంగాణ అర్చక, ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ గంగు భానుమూర్తి స్పష్టం చేశారు.
No comments:
Post a Comment