కచ్చితంగా చెప్పగలను, ఇటువంటి నాయకుడిని రాష్ట్ర చరిత్రలో నేను చూడలేదు. చదవలేదు. నేను వెళ్లేసరికి ఒక పెద్ద కట్ట పత్రికలు ఆయన సీటు పక్కన టీపాయ్‌పై ఉన్నాయి. కనీసం ఇరవై పత్రికలయినా ఉండి ఉంటాయి. సాదాసీదా దుస్తుల్లో రీడింగ్ గ్లాసెస్ పెట్టుకుని ఆయన అన్ని పత్రికలు ముందేసుకుని చదువుతుంటే ఫొటో తీసుకోవాలనిపించింది. అడిగాను. వద్దని వారించారు. ఇది అరుదైన దృశ్యం కావాలన్నాను. మనకిప్పుడు కొత్తగా ప్రచారం అవసరమా? అన్నారు.
ఏ విద్వత్తు లేకుండా నాయకులు కావచ్చు, కానీ, రాజనీతిజ్ఞులు కాలేరు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించడం, ఆ లక్ష్యసాధనకు జనశ్రేణులను, రాజకీయ వ్యవస్థను సమాయత్తం చేయడం, ఒప్పించడం, అన్ని వర్గాలను ఉద్యమపథంలో నడిపించడం, ఆ ఉద్యమం ప్రజాస్వామ్యం గీసిన గీతలను దాటకుండా ముందుకు సాగేట్టు చూడడం, ఎత్తు పల్లాలు, వెలుగు నీడలను జయించి ముందుకు సాగడం కేవలం నాయకుల వల్ల కాదు. అంతకు మించిన శక్తి, సత్తా, దిటవు, చైతన్యం కావాలి. తెలంగాణ సాధకుడు, ఛోదకుడు కె.చంద్రశేఖర్‌రావు అటువంటి అసాధారణ నాయకుడు. ఆయన రాజనీతిజ్ఞుడు, అరుదైన రాజకీయ కోవిదుడు. ఆయన సాధన, శోధన అసాధారణం. తెలంగాణలో ఇంచుఇంచు తెలిసిన ఏకైక నాయకుడు. తెలంగాణ సమస్యలను ఆకళింపు చేసుకున్న తొలినాయకుడు.
తెలంగాణ బాధను తన బాధగా మల్చుకున్న ప్రజానాయకుడు. లోపాలు లేవని, ఉండవనీ కాదు. మార్టిన్ లూథర్ కింగ్ నుంచి మహాత్మాగాంధీ వరకు ఉద్యమ ప్రస్థానంలో కిందామీదా పడినవారే. తప్పులు చేసినవారే. భూమి పొరల్లో ప్రకంపనలకు దారితీసే ఫాల్ట్స్ ఉన్నట్టే ప్రతి మనిషిలో సహజాతమైన ఫాల్ట్స్ ఉంటాయి. కానీ, ఆ మహానాయకులు సాధించిన అసాధారణ విజయాల ముందు అవి వెలవెలబోతాయి. అవి పిపీలికాలవుతాయి. చంద్రునిలో మచ్చలవుతాయి. కచ్చితంగా చెప్పగలను ఇటువంటి నాయకుడిని రాష్ట్ర చరిత్రలో నేను చూడలేదు. చదవలేదు.
ఒకరోజు నీటిపారుదల ప్రాజెక్టుల గురించి మాట్లాడడానికి పిలిచారు. ఆ రోజు అధికారులకు సెలవు. సందడి లేదు. వెళ్లే సరికి ఆయన, ఒక టెక్నికల్ అసిస్టెంట్ ఉన్నారు. ఆయన సీటుకు ఎదురుగా పెద్ద వీడియో వాల్. అందులో గూగుల్ ఎర్త్ మ్యాప్ కనిపిస్తున్నది. ఆ మ్యాప్ చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. మ్యాప్‌నిండా ఎర్రని గుర్తులు.
సముద్రమట్టం నుంచి ఎత్తును గుర్తించే గుర్తులు. నదుల వెడల్పును కొలిచిన గుర్తులు. తెలంగాణ జిల్లాల్లో ఏయేఏయే ప్రాంతాల వాలు ఎటు ఉందో గుర్తించే చిహ్నాలు. దాదాపు అరగంట పాటు నాకు వివరించారు. ఆయన నీటిపారుదల ఇంజనీరు కాదు. సాంకేతిక నిపుణుడు అంతకన్నా కాదు, కానీ వాళ్లెవరూ ఆయన ముందు చాలరనిపించింది. తెలంగాణలోని ఇంజనీర్లంతా ఇంతగా తపిస్తే తెలంగాణ ఇప్పుడు ఇలా ఉండేదా అనిపించింది. ప్రాణహిత-చేవెళ్లను మార్చాల్సివస్తే చేపట్టవలసిన ప్రత్యామ్నాయ ప్రాజెక్టుల గురించి ఆయన యోచిస్తున్నారు. అధ్యయనాన్ని వ్యాప్కోస్‌కు అప్పగించారు. ఇంజనీర్లను ఏరియల్ సర్వే చేసి రమ్మని చెప్పారు. అయినా ఆయన విశ్రమించదల్చుకోలేదు. సార్ నిన్న రాత్రి తెల్లవారు జామున రెండు గంటల దాకా ఈ మ్యాప్‌ను పరిశీలిస్తూ ఈ గుర్తులన్నీ పెట్టారు అని అసిస్టెంట్ చెబుతున్నారు.
కాళేశ్వరానికి దిగువన, మేడిగడ్డకు ఎగువన గోదావరి నది 4.2 కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉందని ఆయన గూగుల్ మ్యాప్‌పై చూపిస్తుంటే నేను విస్తుపోయాను. మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మిస్తే నదీ గర్భంలోనే 20 టీఎంసీల నీటిని నిలువ చేసుకోవచ్చునని ఆయన చెప్పారు. టెక్నాలజీ ఎప్పుడూ ఉంటుంది. కానీ వాటిని ఉపయోగించే చైతన్యం, తపన, ఓపిక ఎంతమంది నాయకులకు ఉం టుంది? జలయజ్ఞం ప్రారంభించిన రాజశేఖర్‌రెడ్డి కూడా పోతిరెడ్డిపాడు మ్యాపు తప్ప మరే మ్యాపులూ చూసి ఉండరు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులయితే పోతిరెడ్డిపాడుకు శంకుస్థాపనలు చేసి వచ్చారు. హంద్రీనీవాకు నివాళులు పట్టారు.
సుమారు 1100 కిలోమీటర్ల పొడవు, 22 లిఫ్టులతో ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో మిడ్ మానేరు తర్వాత ఒక్క పెద్ద రిజర్వాయరు కూడా ప్లాను చేయలేదంటే ఆ ప్రాజెక్టు ఎంత బూటకమో అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ ఇప్పుడా ప్రాజెక్టును నిజంగా నీళ్లిచ్చే ప్రాజెక్టుగా మలచడానికి ఆరాటపడుతున్నారు. అద్భుతమైన పరిశీలనా శక్తి, అసాధారణమైన గ్రహణశక్తి, మనుషులను సమ్మోహన పరిచే వాక్శుద్ధి ఆయన సొంతం. ఒక పని తలపెట్టారంటే ఆయన విశ్రమించరు. నిరంతరం వెంటాడుతుంటారు. అందరినీ పరిగెత్తిస్తారు. ఒక్కోసారి అవతలివారు హడలిపోయేంతగా ఆయన తరుముతుంటారు. ఆయన ఏ అంశాన్ని పట్టుకున్నా అంతే.
మరోరోజు ఉదయమే రమ్మన్నారు. గతంలో కూడ ముఖ్యమంత్రుల వద్దకు వెళ్లిన సందర్భాలు, వారి అలవాట్లు చూసిన సందర్భాలు, తెలుసుకున్న సందర్భాలు ఉన్నాయి. కేసీఆర్‌తో అనుభవం పూర్తిగా భిన్నం. పీఆర్వోలు ఏవో కొన్ని పేపర్ క్లిప్పింగ్‌లు ఫైలు చేసుకొచ్చి ముఖ్యమంత్రికి ఇవ్వడం, వాటిని తిరగేసి పక్కన పడేయడం, తిరిగి పనిలో పడిపోవడం ఏ ముఖ్యమంత్రి అయినా సాధారణంగా చేసే పని. కానీ, కేసీఆర్ అందరిలాంటి వారు కాదు. ఆయన బలం చదువే. పుస్తకాలు చదువుతారు.
పత్రికలు చదువుతారు. అవి కూడా ఆసాంతం. నేను వెళ్లే సరికి ఒక పెద్ద కట్ట పత్రికలు ఆయన సీటుపక్కన టీపాయ్‌పై ఉన్నాయి. కనీసం ఇరవై పత్రికలయినా ఉండి ఉంటాయి. సాదాసీదా దుస్తుల్లో రీడింగ్ గ్లాసెస్ పెట్టుకుని ఆయన అన్ని పత్రికలు ముందేసుకుని చదువుతుంటే ఫొటో తీసుకోవాలనిపించింది. అడిగాను. వద్దని వారించారు. ఇది అరుదైన దృశ్యం కావాలన్నాను. మనకిప్పుడు కొత్తగా ప్రచారం అవసరమా? అన్నారు. దటీజ్ కేసీఆర్. ఒక్కొక్కటి తీసి చదువుతున్నారు. కొన్ని వార్తలు పూర్తిగా. కొన్ని వార్తలు పైపైన. కొన్ని వార్తలను మార్కు చేస్తున్నారు. పక్కన పెడుతున్నారు.
జిల్లా టాబ్లాయిడ్‌లతో సహా అలా ఇరవై పత్రికలనూ చదువుతూనే ఉన్నారు. అవి చదువుతూనే వచ్చిన వాళ్లనుద్దేశించి... చెప్పిన పనులు, చేసిన వివరాలు అడుగుతున్నారు. ఆయన టీపాయ్‌పైన, పక్కనే బుక్‌కేస్‌లో రెండు మూడు డజన్ల పుస్తకాలు ఉన్నాయి. బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆయన తనకు నచ్చిన పుస్తకం ఒకటి తీసుకుని చదువుతారు. ప్రాచీన సాహిత్యం బాగా ఇష్టం. పద్యాలు, పాటలు, సామెతలు మళ్లీమళ్లీ చదువుతుంటారు. అలాగని ఆయన సనాతనుడు కాదు. ఆధునికుడు కూడా. న్యూజనరేషన్ పుస్తకాలు వదలరు. ప్యూచర్ షాక్ వంటి పుస్తకాలు కూడా ఆయన చదివారు. ఆయన అప్‌డేట్ అయినట్టుగా అందరూ కాలేరు. ఐప్యాడ్‌ను ఆయన ఉపయోగించినంతగా మరెవరూ ఉపయోగించలేదు. హైదరాబాద్‌లో విడుదలైన ప్రతి కొత్త ఐపాడ్ ముందుగా ఆయనే ఉపయోగించారు. ఆ ఐపాడ్‌తోనే ఆయన తెలంగాణను అడుగడుగు తడిమి చూశారు.
ఆయన సంఘజీవి. ఒంటరిగా భోజనం చేయడం ఆయనకు అలవాటు లేదు. భోజనం సమయానికి ఎంతమంది సహచరులు అందుబాటులో ఉంటే అంతమందితో కూర్చుని మాటా ముచ్చట పెడుతూ భోజనం చేయడం ఆయనకు ఇష్టం. ఒక విధంగా ఆయన జీవితం తెరచిన పుస్తకం. దాపరికాలు ఉండవు. పని గురించి మాట్లాడేప్పుడు ఎంత సీరియస్‌గా ఉంటారో, సాధారణ సందర్భాల్లో అంతే హాయిగా అరమరికలు లేకుండా మాట్లాడతారు. ఆయన ప్రతి క్లిష్ట సందర్భంలోనూ పది మంది అభిప్రాయాలు సేకరిస్తారు. ఆయన నిర్ణయం ఆయన తీసుకుంటారు. తనతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఎవరయినా దుర్వినియోగం చేస్తున్నారని తెలిస్తే ఆయన సహించలేరు. నమ్మినవారికి కొండంత అండగా ఉంటారు. నమ్మక ద్రోహులకు సింహస్వప్నమే అవుతారు. మంచికి మంచి, చెడుకు చెడు. తెలంగాణ స్ఫూర్తిదాత, ప్రదాత కేసీఆర్.
తెలంగాణ ఎవరు ఇచ్చారు, ఎవరు తెచ్చారు అన్న చర్చే అర్థరహితం.
దేశానికి స్వాతంత్య్రం బ్రిటిషువాళ్లే దయతలచి ఇచ్చారనగలమా? మరి మహాత్ముడు, నెహ్రూ, సుభాష్‌చంద్రబోస్...ఇంకా వేనవేల యోధులు చేసిన పోరాటం ఏమవుతుంది? భారత స్వాతంత్య్ర యోధులు సృష్టించిన అనివార్యతల కారణంగానే బ్రిటిషువాళ్లు దేశాన్ని వదలిపోయారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు రాష్ట్రస్థాయిలో, జాతీయ స్థాయిలో విస్తృత రాజకీయామోదాన్ని సాధించి, అన్ని స్థాయిల్లో రాజకీయ అనివార్యతలు సృష్టించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకతప్పని పరిస్థితులు సృష్టించిన ఘనత ముమ్మాటికీ కేసీఆర్‌ది. దేశానికి గాంధీ చేసిందే రాష్ర్టానికి కేసీఆర్ చేశారు. గాంధీతోపాటు గాడ్సేలు ఉన్నట్టే, తెలంగాణలో కూడా కేసీఆర్‌కు అటువంటి వాళ్లు కొందరు ఉన్నారు. వాళ్లు దేనినీ గుర్తించరు. దేనికీ కొరగారు. కేసీఆర్ ముందు వాళ్లంతా పిపీలికాలు. వాళ్లు ఎంత ఎగిరితే కేసీఆర్ అంత ఎదుగుతారు.
No comments:
Post a Comment