చెత్తను ఊడ్చి, ఈ హైదరాబాద్ నగరాన్ని అందంగా తీర్చిదిద్దు తున్నవారు తనకు దేవుళ్లతో సమానమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. మనం శుభ్రమైన నగరంలో ఉన్నామంటే దానికి కారణం వారేనని చెప్పారు. అందుకే వారు దేవుళ్లని అంటున్నానని పేర్కొన్నారు. సఫాయి కర్మచారీలకు సెల్యూట్ చెప్పాలి. వారు మన విసర్జనలను భరిస్తున్నారు. వారు మనతోపాటే సాటి మనుషులు. మనం బాధ్యత తీసుకుంటే వారి బాధ కొంత తగ్గుతుంది. మనం ఈ నగరాన్ని ఎంత గొప్పగా ఉంచాలనుకుంటున్నామో అంత చైతన్యం కావాలి అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఈ రోజు చేపడుతున్న స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం రేపటి స్వచ్ఛ తెలంగాణకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. స్వచ్ఛ తెలంగాణ-స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రాజధాని నగరంలోని హెచ్‌ఐసీసీలో శనివారం జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. స్వచ్ఛ హైదరాబాద్ లోగోను, ఫేస్‌బుక్ పేజీని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..
-సఫాయి కర్మచారీలకు సలామ్
- చెత్త ఊడ్చేవాళ్లు నాకు దేవుళ్లు.. నగర శుభ్రతలో వారికి తోడుగా నడుద్దాం
- అందమైన నగరాన్ని ప్రజలకు అందిద్దాం.. స్వచ్ఛ హైదరాబాద్‌ను ప్రారంభిస్తూ సీఎం కేసీఆర్
- మంచి తలిస్తే మంచే జరుగుతుంది.. ప్రజలు ఐక్యంగా ఉంటే ఏం సాధించగలరో చూపండి
- మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో స్వచ్ఛ తెలంగాణ: అధికారులకు సీఎం సూచనలు
- స్వచ్ఛ భారత్ నినాదం కాదు.. అదొక విధానం.. ఆ స్ఫూర్తితోనే స్వచ్ఛ హైదరాబాద్
- రాష్ట్ర ప్రభుత్వ కృషికి కేంద్ర మంత్రి దత్తాత్రేయ అభినందన
- కేసీఆర్ ఏ పని మొదలుపెట్టినా వదలరు..ఇది కూడా విజయవంతం కావాలి: గవర్నర్
స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొనే అధికారులపై ఎలాంటి ఆంక్షలు లేవు. ఎన్ని గంటలు అనేది మీ ఇష్టం. బస్తీ ప్రజలు ఏ టైంకు రమ్మంటే ఆ టైంకు పోయి పనులు చేద్దాం. ప్రజలు సంఘటితం అయితే ఎట్లా ఉంటుంది? దానివల్ల వచ్చే శక్తి ఏమిటో వారికి చూపిద్దాం. ప్రజలు ఐక్యంగా ఉంటే ఏం సాధించగలరో నేర్పిద్దాం. అధికారులు ఈ రోజే సమయం ఉంటే సాయంత్రంలోపు బస్తీలకు వెళ్లి స్టడీ చేయండి. వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లు, శ్మశాన వాటికలు, మంచినీటి సదుపాయం వంటి వాటిని గమనించండి. బస్తీలోని ప్రజలకు మీరు నాయకత్వం వహించండి.
గొప్ప నగరాలూ ఒకప్పుడు మామూలువే
మనం చేపట్టే పని మంచిదైతే అందరూ కలిసొస్తారనేది నానుడి. ఇనాడు గొప్పనగరాలన్నీ ఒకనాడు మామూలుగా ఉన్నవే. ఎవరో ఒకరు ముందుకొచ్చి సరిచేయడం వల్లే గొప్పనగరాలుగా మారాయి. హైదరాబాద్ ప్రపంచంలోనే ఆరుదైన నగరం. సమశీతోష్టస్థితి కలిగిన నగరం. కేంద్ర ఎలక్షన్ కమిషన్ మాజీ ప్రధానాధికారి లింగ్డో ఎక్కడో ఈశాన్య రాష్ర్టాలనుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు. దీనికి కారణం హైదరాబాద్ నగర ఖ్యాతి, ప్రఖ్యాతే. ఈ నగరం ఎంత బాగుందో, ఎంత బాగోలేదో మనకు తెలుసు. దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో హైదరాబాద్ ఒకటి అయినా.. పౌరసేవలు లేవన్న విషయం కూడా తెలుసు. ఈ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడంలో ఎలాంటి అయోమయం లేదు. అదే సమయంలో ఇది ఒక టైంబౌండ్ ప్రొగ్రాం కూడా కాదు. మెంటర్స్ వారికి కేటాయించిన బస్తీలకు వెళ్లి, అక్కడి పెద్దలతో చర్చించి, వారితో నాలుగైదు గంటలు గడిపి, వారి ఆలోచనలకు అనుగుణంగా పనులు మొదలుపెడదాం. 20వ తేదీవరకు ఎలాంటి పనులు చేయాలనేది ప్లాన్ రూపొందించుకోవాలి. బస్తీల్లో ఉన్నవేంటి? లేనిదేంటి? జరగాల్సిందేంటి? అనేది నివేదిక రూపొందించి పనులు జరిగేలా చూసుకోవాలి. నిధులు ఎక్కువ అవసరం అయితే ప్రభుత్వమే ఇస్తుంది.
బాపూజీ స్వాతంత్య్ర ఉద్యమం సమయంలో దళితవాడలకు వెళ్లి అక్కడ పరిశుభ్రత గురించి ప్రచారంచేశారు. స్వచ్ఛభారతే నిర్మల్ భారత్ అన్నారు. ప్రధాని మోదీ స్వచ్ఛభారత్ కార్యక్రమం తెచ్చారు. మనం స్వచ్ఛ తెలంగాణ-స్వచ్ఛ హైదరాబాద్ చేపట్టాం. ఇవాళ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం తరువాత రేపు మున్సిపాలిటీల్లో, గ్రామ పంచాయతీల్లో చేపట్టే స్వచ్ఛ తెలంగాణకు స్ఫూర్తిగా నిలవాలి.
దత్తాత్రేయకు కృతజ్ఞతలు
కేంద్రమంత్రి దత్తాత్రేయకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంపై చర్చించే సందర్భంలో ఆయన ఎన్ని వందల కోట్లు దీనికి పెట్టారని అడిగారు. నేను రూ.200కోట్లు అన్న. ఆయన కూడా నగరవాసిగా వెంటనే నీతిఅయోగ్‌తో మాట్లాడి రూ.75కోట్లు మంజూరు చేయించారు. మంచి తలచుకుంటే దేవుడు ఎలా సహకరిస్తాడో ఇదే ఉదాహరణ.
గవర్నర్ తనిఖీలు చేస్తే చాలా మంచిది
స్వచ్ఛ తెలంగాణ-స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని రూపొందించి గవర్నర్ నరసింహన్ వద్దకు వెళ్లి.. ఇందులో మీరుకూడా భాగస్వాములు కావాలని కోరాం. వెంటనే గవర్నర్ తనకూ ఒక భాగం ఇవ్వాలని కోరి.. బాధ్యత తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనందుకు ఆయనకు నగర ప్రజల తరపున కృతజ్ఞతలు. గవర్నర్ పరిధి పెద్దది గనుక ఎక్కువ మొత్తంలో తనిఖీలు చేయాలి. దీనివల్ల అధికారులకు స్ఫూర్తి కలుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా డిజైన్‌చేసిన జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌కు అభినందనలు. పారిశుద్ధ్య కార్మికులకు అండగా, తోడుగా మనం కూడా నడుద్దాం. అందమైన నగరాన్ని తయారుచేసి ప్రజలకు ఇద్దాం.. అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
స్వచ్ఛ భారత్ నినాదం కాదు.. విధానం
స్వచ్ఛ భారత్ అనేది నినాదం కాదని అదొక విధానమని భావించి ఆ స్పూర్తితో స్వచ్ఛ హైదరాబాద్ రూపొందించారంటూ తెలంగాణ ప్రభుత్వ కృషిని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అభినందించారు. ప్రజాచైతన్యంతోనే స్వచ్ఛ హైదరాబాద్ విజయవంతం అవుతుందని అన్నారు.
నేను పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు
తెలంగాణ ప్రభుత్వం స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో గొప్ప కార్యక్రమం చేపట్టిందని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ కొనియాడారు. నేను ఏ కార్యక్రమంలో పాల్గొన్నా.. ఈ కార్యక్రమంలో పాల్గొనటం నా సంతోషం అని అంటుంటాను. ఇక్కడ ఆ మాట చెప్పడం లేదు. ఈ పనిలో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు చెప్తున్నా. స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ అంటే సంతోషపడ్డాను. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వచ్ఛ భారత్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయం. ప్రపంచంలోనే మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రజల ముందుకు వెళుతున్నది. ఇది అభినందనీయం అని అన్నారు. కేసీఆర్ ఏదైనా పని మొదలుపెడితే దాన్ని వదిలిపెట్టరు. స్వచ్ఛ హైదరాబాద్‌ను సైతం ఇదే విధంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం నగర ప్రజలకు కొత్త కిరణం. దీనిద్వారా హైదరాబాద్ ప్రజల సంతోష సూచీ పెరగాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నిర్వహించాలి. రాబోయే సమావేశాల్లో స్వచ్ఛ హైదరాబాద్ విజయవంతం అయిందని మనమంతా చర్చించుకోవాలి అని గవర్నర్ అన్నారు. ఎవరైనా చెత్త పారేస్తే చూస్తూ ఊరుకోకుండా వారికి పాఠం నేర్పాలని గవర్నర్ సూచించారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం రాజకీయ కార్యక్రమం కాదు. ప్రజా కార్యక్రమం. అందుకే మన హైదరాబాద్ అనే స్ఫూర్తితో ప్రతి పౌరుడు పనిచేయాలి. అలా చెత్తవేసిన వారితో ఏం మాట్లాడకుండా వారి ముందే ఆ చెత్తను తొలగించండి. అలా చేయడంద్వారా వారికి బుద్ధి వస్తుంది. ఎవరైనా కారులో నుంచి చెత్తను బయటకు వస్తే.. ఆపి చెత్త తీయించాలి అని స్పష్టం చేశారు.
హైదరాబాద్ ఖ్యాతిని మరింత పెంచుదాం

ప్రపంచ ప్రఖ్యాత హైదరాబాద్ ఖ్యాతిని మరింత పెంచేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో స్వచ్ఛ హైదరాబాద్‌ద్వారా మరింత కృషిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సూచించారు. విజయవంతంగా పూర్తిచేసేందుకు ఉద్యోగులు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. జీహెచ్‌ఎంసీ స్పెషల్ ఆఫీసర్ సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ.. స్వచ్ఛ హైదరాబాద్‌ను విజయవంతం చేసేందుకు 425 కమిటీలు ఏర్పాటుచేసి 456 మంది మెంటర్లను నియమించామని, 36,000 మంది ఉద్యోగులు ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటారని తెలిపారు. స్వచ్ఛ హైదరాబాద్‌ద్వారా చెత్తా చెదారం తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేకంగా 34 జేసీబీలను, 6023 వాహనాలను ఏర్పాటుచేసిందని, మరమ్మతులు ఎదురైతే చేసేందుకు 400 వాహనాలను సిద్ధంగా ఉంచామని వివరించారు. కాగితాల ద్వారా నివేదికలు ఇస్తే ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో ప్రత్యేకంగా మొబైల్ యాప్ రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ ఆలీ, మంత్రులు, పార్లమెంటరీ సెక్రటరీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఎఎస్‌లు, ఐపీఎస్‌లు, ఐఆర్‌ఎస్‌లు, ఐఎఫ్‌ఎస్‌లు, ఇతర అధికారులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
No comments:
Post a Comment