మంద కృష్ణ వ్యూహమేమిటి?

చట్టసభల్లో తమ వాణి వినిపించేందుకే ఎమ్మార్పీఎస్‌ ఎన్నికల బరిలోకి వచ్చిందా అంటే అవుననే రాజకీయ విశ్లేషకులు అ౦టున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్‌పార్టీ ఓటు బ్యాంకుగా ఉన్న మాదిగలు ప్రస్తుతం తమ రూటును మహా కూటమి వైపు మార్చారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్న మహా కూటమికి మద్దతివ్వడమే పరోక్షంగా అధికార పార్టీని దెబ్బతీయడమనే వ్యూహంతో ఉంది. ఈ నేపధ్యంలో ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీచేసి లోక్‌సభ, శాసనసభలో వర్గీకరణపై అమీతుమీ తేల్చుకునేందుకు సిద్దమైనట్లు తెలుస్తున్నది. దీంతో అధికారపార్టీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకగా మారింది. ఇప్పటి వరకు మెజారిటీ మాలలతో పాటు గత ఎన్నికల్లో మాదిగలు కూడా కాంగ్రెస్‌ వెన్నంటి నిలిచారు.

వచ్చే ఎన్నికల్లో 30 అసెంబ్లీ, నాలుగు లోక్‌సభ స్థానాలకు పోటీచేసే ప్రతిపాదనలను మహా కూటమి ముందుంచారు. అటు ఇటుగా సీట్లు ఖరారు అయ్యే అవకాశాలున్నాయి. ఇంతకాలం కాంగ్రెస్‌పార్టీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్సీల్లో బలమైన వర్గంగా ఉన్న మాదిగలపై కాంగ్రెస్‌ పార్టీ ఆశలు వదులుకున్నట్లే. ఎస్సీ వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మాదిగలు, మాదిగ ఉపకులాలను మోసం చేశారని ఎమ్మార్పీఎస్‌ బహిరంగంగా ప్రకటించింది. పార్లమెంటు చివరి రోజు వరకు వర్గీకరణకు చట్టబద్దత కలుగుతుందని వెయ్యి కళ్ళతో ఎదురుచూసిన ఎమ్మా ర్పీఎస్‌కు నిరాశే మిగిలింది. ఫలితంగా ఎమ్మార్పీఎస్‌ కాంగ్రెస్‌ తీరుపై కన్నెర్ర చేసింది. మాట ఇచ్చి మోసం చేసిన సిఎంపై నిప్పులు కక్కింది. రాష్ట్రంలో సోనియాగాంధీ సభలు జరగకుండా అడ్డుకుంటామని ఎమ్మా ర్పీఎస్‌ వ్యవస్థాపక అద్యక్షుడు మంద కృష్ణమాదిగ హెచ్చరించారు. సోనియాగాంధీ సభ రోజున ఎమ్మార్పీఎస్‌ శ్రేణులు గాంధీభవన్‌పై దాడిచేసి అన్నంతపని చేశారు. ఎమ్మార్పీఎస్‌ ఉద్యమాన్ని మరింతగా బలోపేతంగా ఆలోచింప జేశాయి. రాజకీయ నిర్ణయం తీసుకుని, చట్టసభల్లో నేరుగా గొంతువిప్పి తమ ఆశయాలను సాధించుకునే దిశలో మహాకూటమికి ఎమ్మార్పీఎస్‌ తమ ప్రతిపాదనలను తెలిపింది. మహాకూటమి నేతలు స్వాగతించారు.

రాష్ట్రంలో మాలలు అనేక సంఘాలు, సంస్థలు ఏర్పడడం, వాటిలో కొన్ని తెలుగుదేశం పార్టీ, ప్రజారాజ్యం పార్టీలకు అండగా నిలిచాయి. కేవలం ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు నేతృత్వంలోని మాల మహానాడు మాత్రమే కాంగ్రెస్‌కు మద్దతునిస్తుంది. వీటికి తోడు దళితుల ఉపప్రణాళిక నిధులు దారిమళ్ళుతున్నాయని ప్రభుత్వ పనితీరును ఎండ గట్టిన సంతనూతలపాడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దారా సాంబయ్య పట్ల కాంగ్రెస్‌వర్గాలు గుర్రుగా ఉన్నాయి. అధికారపార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వ చర్యను విమర్శించడం, ప్రకాశం జిల్లాలో ప్రోటోకాల్‌ అంశంపై మరో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం, దీనిపై ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫిర్యాదుచేయడం అధికారపార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో అమలాపురం ఎంపీ హర్షకుమార్‌ సైతం సిఎంపై బహిరంగ విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయనకు మళ్ళీ టిక్కెట్టు ఇవ్వని పక్షంలో ఆయన కూడా కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసే అవకాశాలున్నాయి.ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌కు మాలల ఓట్లు కూడా చాలావరకు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.

No comments:

Post a Comment