చిరు ఇమేజీ ఉండగా.. కామన్ సింబలెందుకు?

వెండితెర మెగాస్టార్ చిరంజీవి ఇమేజీ ఉండగా, ఒకే ఎన్నికల గుర్తు ఎందుకని పలువురు ప్రజారాజ్యం పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఒకే గుర్తు కోసం సాగిస్తున్న న్యాయపోరాటం ఫలించక పోతే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోగి దిగాలే గానీ, "అరువు" గుర్తుపై పోటీ చేయరాదని పలువురు నేతలు అధిష్టానానికి చూసిస్తున్నారు. దీనివల్ల భవిష్యత్‌లో మరిన్ని చిక్కులు ఎదురుకాక తప్పదన్నది వారి వాదన.

ఇదిలావుండగా, తమ పార్టీ గుర్తు (సింహం)ను ఉపయోగించుకోవాలని ఎన్టీఆర్ తెలుగుదేశం అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి చేసిన ప్రతిపాదనను ప్రజారాజ్యం సున్నితంగా తిరస్కరించింది. ఈ విషయమై చర్చించిన ప్రజారాజ్యం నాయకులు సాధ్యమైనంత వరకు కోర్టు ద్వారానే పార్టీ గుర్తును రాబట్టుకోవాలని, అలా వీలు కాకపోతే స్వతంత్రంగా బరిలోకి దిగేందుకు సిద్ధపడుతున్నారు.

ముఖ్యంగా, మరో పార్టీ బి-ఫారాలతో పోటీ చేసినా, ఆ తరువాత వచ్చే ఎన్నికల్లోనూ ఇదే సమస్య ఎదురుకావచ్చని కొందరు న్యాయ నిపుణులు సలహా ఇచ్చారు. అందువల్ల ఈ దఫాకి స్వతంత్రులుగానే బరిలోకి దిగితే వచ్చే ఎన్నికల సమయానికి ఖచ్చింతగా ఒకే గుర్తు లభిస్తుందన్నది వారి వాదన.

అలాగే, చిరంజీవి ఇమేజ్ ముందు ఎన్నికల గుర్తు పెద్ద ప్రభావం చూపబోదని మరికొందరి వాదనగా వుంది. ఏది ఏమైనా ఎన్నికల సమయం కరిగిపోతున్న కొద్దీ ప్రజారాజ్యం పార్టీకి ఎన్నికల గుర్తుపై ఆందోళన మాత్రం వీడటం లేదు.

No comments:

Post a Comment