మొబైల్ ఫోన్ హైదరాబాద్ రెండు లక్షల మందికి ఉపాధి

పారిశ్రామికంగా కొత్త పుంతలు తొక్కుతున్న హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరబోతున్నది. సామాన్యులకు సైతం కనీసావసరంగా మారిపోయిన మొబైల్ ఫోన్లు ఇకపై మేడిన్ హైదరాబాద్ బ్రాండ్‌తో తయారు కానున్నాయి. ఇప్పటిదాకా మొబైల్ ఫోన్ల తయారీ కేంద్రాలు ఇతర దేశాల్లోనే ఉన్నాయి. కానీ.. భారతదేశంలో మొట్టమొదటి మొబైల్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు పలు అంతర్జాతీయ మొబైల్ కంపెనీలు ముందుకు వచ్చాయి. తద్వారా లక్షన్నర నుంచి రెండు లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం, పలు కంపెనీల మధ్య సూత్రప్రాయ అంగీకారం కుదిరింది.


హైదరాబాద్‌లో మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు మంగళవారం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిశారు. సదరు కంపెనీలకు హబ్ ఏర్పాటుకు అవసరమైన స్థలం కేటాయించడంతోపాటు ఇతర సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. హబ్ ఏర్పాటుకు ఇంకా ఏమేంకావాలో సమగ్ర ప్రాజెక్టు నివేదిక ఇవ్వాలని, తద్వారా ప్రభుత్వం ఏం చేయాలనే విషయంలో స్పష్టత వస్తుందని తనను కలిసిన మొబైల్ కంపెనీల ప్రతినిధులకు సీఎం సూచించారు. మొబైల్ హార్డ్‌వేర్ పరిశ్రమను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లూ చేస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో తీసుకురానున్న పారిశ్రామిక విధానాన్ని, సింగిల్ విండో అనుమతుల వ్యవస్థను, చేజింగ్ సెల్ పని విధానానాన్ని సీఎం కేసీఆర్ వారికి వివరించారు.

ఇప్పటి వరకు చైనా దేశం మొబైల్ హార్డ్‌వేర్ రంగంలో ముందున్నదన్న సీఎం.. భారతదేశంలో హైదరాబాద్‌ను ఈ రంగంలో అగ్రగామిగా నిలబెడదామని చెప్పారు. సీఎంను కలిసినవారిలో ఇండియన్ సెల్యూలార్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు పంకజ్ మహీంద్రా, కార్బన్ మొబైల్స్ చైర్మన్ సుధీర్‌హసీజా, ఫాక్స్‌కాన్ ఇంటర్నేషనల్ ప్రతినిధి యోయో, ఫాక్స్‌కాన్ ఇండియా ఎండీ జోహ్‌ఫాల్జర్, సిలికాన్ ఎండీ వై గురు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మురళి రేటినేని, వాటర్ వరల్డ్ ఇంటర్నేషనల్ ప్రతినిధి టోనీ తదితరులు ఉన్నారు. అంతకు ముందు వీరు పరిశ్రమలశాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్, టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నరసింహారెడ్డితో సమావేశమయ్యారు.

పరిశ్రమల శాఖ పరిధిలోని భూములను ప్రతినిధులకు అరవింద్‌కుమార్, నరసింహారెడ్డి చూపించారు. రంగారెడ్డి జల్లా పరిధిలోకి వచ్చే మామిడిపల్లి, రావిర్యాల, మహేశ్వరం ప్రాంతాల్లోని భూములను పరిశీలించారు. మొబైల్ హార్డ్‌వేర్ పరిశ్రమ ఏర్పాటుకు ఈ ప్రాంతం అనువుగా ఉందని ప్రతినిధులు సంతృప్తి వ్యక్తంచేశారు. భూముల పరిశీలన అనంతరం కంపెనీల ప్రతినిధులు సీఎం కేసీఆర్‌ను కలిసి హబ్ స్థాపనపై చర్చించారు.

No comments:

Post a Comment